calender_icon.png 27 September, 2024 | 1:04 PM

అక్రమ నిర్మాణాల కూల్చివేత

26-09-2024 12:30:55 AM

నగరంలోని మూడు ప్రాంతాల్లో షెడ్లు, నిర్మాణాల తొలగింపు

ఆందోళన వ్యక్తం చేసిన చిరువ్యాపారులు

ఎల్బీనగర్/ పటాన్‌చెరు/ శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 25 : రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పరిధిలోని రైతుబజార్ ప్రాంతంలో రహదారులను అక్రమించి చిరు వ్యాపారులు నిర్మించిన దుకాణాలు, ఏర్పాటు చేసిన షెడ్లను బుధవారం ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసుల ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కూల్చివేసింది.

ఆక్రమణల కారణంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికుల నుంచి జీహెచ్ ఎంసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించారు. మరోవైపు దుకాణాలు, షెడ్లలో ఉన్న పండ్లు, పూలతో పాటు ఇతర సామగ్రిని సైతం తీసుకోకుండానే కూల్చివేశారని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

బందోబస్తును వనస్థలిపురం సీఐ అశోక్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు పర్యవేక్షించారు. అలాగే అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో ఓ వ్యక్తి బల్దియా నుంచి రెండంతస్తుల నిర్మాణా నికి అనుమతులు తీసుకున్నాడు. కానీ, ఐదు అంతస్తులు నిర్మిస్తున్నాడు. దీంతో బల్దియా అధికారులు అతడికి నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఆయన స్పందించలేదు.

టీపీవో పవన్ పర్యవేక్షణలో సిబ్బంది  అక్రమంగా నిర్మించిన మరో రెండు అంతస్తులను కూల్చివేశారు. కాగా, ఇంటి నిర్మాణం సర్వే నంబర్ 1056లో ఉండగా, పక్కనే ఉన్న 1004 సర్వే నెంబర్ పేరుతో యజమాని అనుమతులు తీసుకున్నాడని తెలిసింది. అధికారులు త్వరలో సర్వే చేపట్టి, అది ప్రభుత్వ భూమి అని తేలితే నిర్మాణం మొత్తాన్ని తొలగిస్తారని తెలిసింది.

మాదాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్ ఫుట్‌పాత్‌పై ఉన్న ఆక్రమణలను రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు ఆక్రమణలను తొలగించారు. టీఎస్‌ఐఐసీ ఫిర్యాదు మేరకు ఆక్రమణలు తొలగించామని ట్రాఫిక్ పోలీసులు చెప్తుండగా, తమకు ఎలాంటి సూచనలు చేయకుండానే చిన్న బడ్డీ కొట్లు, కియోస్క్‌లను తొలగించారని చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.