కొత్త ఆక్రమణలు, నిర్మాణాలను మాత్రం అడ్డుకుంటాం
చెరువుల పరిరక్షణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
రిటైర్డ్ ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, సామాజిక కార్యకర్తలతో సమావేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): చెరువుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో అనధికారికంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదని, చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆక్రమణలు జరిగాయని.. ఇకపై చెరువుల్లో కొత్త ఆక్రమణలు, నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవడ మే ప్రభుత్వ ఉద్ధేశమని అన్నారు.
నగరంలో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ఎఫ్‌టీఎల్ నిర్ధారణ, వరద నీటి కాలువలు పరిరక్షణ తదితర అంశాలపై బుద్ధ భవన్‌లోని హైడ్రా కార్యాలయంలో శుక్రవారం రిటైర్డ్ ఇంజినీర్లు, పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూల్చివేసి చెరువులను పరిరక్షించడం మా ఉద్ధేశం కాదన్నారు.
ఇకనుంచి చెరువులు ఆక్రమణలకు గురికాకుండా అత్యాధునిక సాంకేతికతను ఉపయో గించడంతో పాటు చెరువులపై స్థానికులతో నిఘా పెడుతున్నామన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించాక.. చెరువుల్లో ఏదైనా అక్రమ నిర్మాణం చేపడితే హైడ్రాకు అలర్ట్ వచ్చేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. అమీన్‌పూర్ చెరువు తూములు మూయడం కారణంగా దిగువన ఉన్న లేఔట్లు మునిగినట్టు వివరించారు.
అనుమతులు లేకుంటే కూల్చక తప్పదు..
అనుమతులు లేకుండా ఉన్న నిర్మాణాలు పెద్ద వాళ్లవైనా, పేదలవైనా కూల్చక తప్పదన్నారు. శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదన్నారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లు, విలేజ్ మ్యాప్‌లను పరిగణలోకి తీసుకున్న తర్వాత.. ఎవరి లెక్కలు వారివి కాకుండా అన్నిశాఖల సమాచారంతో నిపుణుల కమిటీతో చెరువుల హద్దులు నిర్ణయిస్తామ న్నారు. హైడ్రా కూల్చివేతలతో ఎఫ్‌టీఎల్ , బఫర్ జోన్లపై ప్రజలకు అవగాహన వచ్చేలా చర్చ జరిగిందన్నారు.
నగరంలోని బతుకమ్మ కుంటలో ప్రస్తుతం మిగిలి ఉన్న ల్యాండ్‌లోనే చెరువును డెవలప్ చేస్తున్నామన్నారు. కొందరు కోర్టుకు వెళ్లి స్టేటస్ ఆర్డర్ తీసుకొచ్చారని తెలిపారు. కోర్టులో మేము కూడా కౌంటర్ వేసి కోర్టు ఆర్డర్ రద్దు కావడానికి తగిన కసరత్తు చేసి త్వరలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధ్దరిస్తామని అన్నారు. ఇప్పుడు చెరువులోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే హైడ్రా లక్ష్యం అని అన్నారు.
మానవత్వం కోణంలో ఆలోచిస్తే సమాజమంతా బాధపడుతుందని.. కొన్నిచోట్ల మేం మనుసు చంపుకొని కూడా పనిచేయాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు, వివిధ శాఖల మేధావులు హైడ్రాకు పలు సూచనలు చేశారన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను ఎలా నిర్ధారించి చెరువులను ఎలా కాపాడాలనే అంశంపై చర్చించినట్టు వివరించారు.
అయితే బెంగుళూరులో చెరువుల పరిరక్షణ విధానం బాగుందని రంగనాథ్ అన్నారు. అక్కడ పూర్తిస్థాయి నీటిమట్టాలను పరిగణనలోకి తీసుకొని చెరువుల హద్దులు నిర్ధారించిన తర్వాతనే ఆక్రమణలు తొలగిస్తున్నారని తెలిపారు. సమావేశంలో చర్చించిన అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ తెలిపారు.