20-03-2025 02:36:55 AM
నిరుపేదలకే చట్టాలు వర్తిస్తాయా?
ఇండ్లు కూల్చి పేపర్లలో ఫొటోలా?
హైడ్రాను మందలించిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): ‘పేదల ఇండ్లు కాదు.. బడా బాబుల ఇండ్లు కూల్చండి. నిరుపేదలకే చట్టాలు వర్తిస్తాయా ? పేదల ఇండ్లు కూల్చి పేపర్లలో ఫొటోలు వేయించుకుంటారా? పలుకుబడి ఉన్నవారికి, ధనవంతులకు నిబంధనలు మాత్రం వర్తించవా ? చెరువుల సంరక్షణ పేరిట మీరు చేసే పనులు ఇవేనా ?’ అంటూ హైకోర్టు బుధవారం హైడ్రాను మందలించింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ పరిధిలోని మీర్‌ఆలం ట్యాంక్ సర్వేనంబర్ 329 /1, 329 /2, 329 /3లోని 6.10 ఎకరాల స్థలంలో వాల్టాచట్టం ఉల్లంఘనపై జారీ అయిన నోటీసులను సవాల్ చేస్తూ షామ్స్ ఫాతిమాఖాన్ అనే మహిళతో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. వక్ఫ్‌బోర్డ్ సీఈవో రాసిన లేఖ ఆధారంగా తహసీల్దార్ నోటీసుల జారీ చెల్లదని కోర్టుకు తెలిపారు.
ఒకవేళ సీఈవో లేఖ చెల్లాలంటే ఆ స్థలం వక్ఫ్‌బోర్డుకు చెందినదై ఉండాలని వాదించారు. ప్రభుత్వ అడ్వొకేట్ తన వాదనలు వినిపిస్తూ.. ఆక్రమణకు గురైన స్థలంలో ప్రభుత్వం కట్టడాలను తొలగిస్తున్నదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ.. మురికివాడల్లో ని కట్టడాలే కాక, బడాబాబులు నిర్మించిన కట్టడాలనూ హైడ్రా కూల్చివేయాలని సూచించారు.
పిటిషనర్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మీర్ ఆలం ట్యాంక్ పరిధిలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఆ తర్వాత స్థలం ప్రభుత్వానిది అని తేలితేనే కట్టడాల కూల్చివేతపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ఆ స్థలం వక్ఫ్‌బోర్డుది అని తేలితే ఆక్రమణల తొలగింపు బాధ్యతలను ఆ బోర్డుకు అప్పగించాలన్నారు.
రేవంత్‌రెడ్డికి ‘డ్రోన్’ కేసు నుంచి విముక్తి
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందిన జన్వాడ ఫాంహౌస్‌పై డ్రోన్లు పంపించి, దృశ్యాలు చిత్రీకరించారంటూ నాటి ఎంపీ రేవంత్‌రెడ్డిపై 2020లో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు పూర్వాపరాలపై విచారించిన హైకోర్టు కేసును కొట్టివేసింది.
తనపై నార్సింగి పీఎస్‌లో నమోదైన కేసు కొట్టివేయాలంటూ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై బుధవారం జస్టిస్ లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. ఫాంహౌస్ ఉన్న ప్రాంతం డ్రోన్ల ఎగురవేతకు నిషేధిత ప్రాంతం కాదని, కాబట్టి పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదని తేల్చిచెప్పి, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బీఆర్‌ఎస్ నేత జీవన్‌రెడ్డికి చుక్కెదురు
తల్లి, సతీమణికి ఊరట
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి పరిధిలో 20 ఎకరాల భూమికి సంబంధించి చేవెళ్ల, మోకిలా పోలీసులు పెట్టిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు తోసిపుచ్చింది. ఇవే కేసుల్లో మందస్తు బెయిల్ కోసం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన ఆయన తల్లి రాజుభాయి, సతీమణి రజితకు జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. వారు రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు.
సీఎంపై కామెంట్స్ కేసు కొట్టివేత
మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌డ్డిని కించపరి చేలా తాను సోషల్‌మీడియాలో పో స్టులు పెట్టినట్లు సైఫాబాద్ పీఎస్‌లో నమోదైందని, ఆ కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీం తో కేటీఆర్‌కు భారీ ఊరట లభించిం ది. సీఎంపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత పోస్టులు పెట్టారంటూ గతేడాది ఆగస్టు 21న ఎంపీ అనిల్‌కు మార్ సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై బుధవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది రమణరావు తన వాదనలు వినిపిస్తూ.. కేటీఆర్ వ్యక్తిగతమై న వ్యాఖ్యలేవని, పోలీసులకు అందిన ఫిర్యాదులో కేటీఆర్ చేసిన నేరమేమిటో పేర్కొన లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలీసులు నమోదు చేసిన కేసు నిబంధనలకు లోబడి లేవంటూ ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు.