calender_icon.png 7 November, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్య యజ్ఞం

20-04-2024 12:05:00 AM

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్‌లో ఓట్ల పండగ మొదలైంది. ఏడు దశలుగా సాగే 2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో బాగంగా శుక్రవారం  మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.  తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు తొలివిడతలోనే పోలింగ్ జరగ్గా, ఏడు విడతలుగా ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, యుపి, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాలకు కూడా తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. అయితే, వేసవి తీవ్రత అధికంగా ఉండడం కారణంగా తొలి విడతలో ఆశించిన దానికన్నా తక్కువ పోలింగ్ జరిగింది. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. సాయంత్రానికల్లా పోలింగ్ పుంజుకుంది.

క్యూలో ఉన్న అందరినీ ఓటు వేసేందుకు అనుమతి ంచనున్నందున మరో రెండు మూడు శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు అందిన లెక్కల ప్రకారం ‘నువ్వా నేనా’ అన్నట్లుగా పోటీ ఉన్న తమిళనాడులో 63.2 శాతం పోలింగ్ జరగ్గా రాజస్థాన్‌లో అతి తక్కువగా 50.3 శాతమే నమోదయింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ మోస్తరుగా 57.5 శాతం పోలింగ్ జరగ్గా, మధ్యప్రదేశ్‌లో 63.3 శాతం పోలింగ్ జరిగింది.  కాగా, లోక్‌సభతోపాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అరుణాచల్ ప్రదేశ్‌లో 66.94, సిక్కింలో 67.95 శాతం పోలింగ్ జరిగింది. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఏ ఎన్నికల్లోనైనా అధిక శాతం పోలింగ్ నమోదవుతూ ఉంటుంది. ఈసారి మాత్రం తక్కువ పోలింగ్ నమోదయింది.

గత లోక్ సభ తొలి విడతలో ౬౯ శాతానికిపైగా పోలింగ్ జరిగింది. మొన్నటి కాంకేర్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా చత్తీస్‌గఢ్‌లో హింసాకాండ చెలరేగుతుందేమోనని చాలామంది భయపడ్డారు. కానీ అలా జరగలేదు. ఊహించిన స్థాయిలో కాకపోయినా, మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలో చిహ్‌కా గ్రామంలో దాడికి పాల్పడ్డారు. ఓటేయడానికి జనం క్యూలో నిలబడి ఉన్న సమయంలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ దాడిలో ఒక సిఆర్‌పిఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్‌లో తృణమూల్, బీజేపీ వర్గాల మధ్య హింస చెలరేగింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. 

కాగా అరుణాచల్‌ప్రదేశ్, అసోం, అండమాన్ నికోబార్ దీవులు లాంటి చోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలుచోట్ల గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. తొలిసారి ఎన్నికల్లో ఓటు వేయడానికి కొత్తగా ఓటుహక్కు పొందిన యువతతోపాటుగా కొత్తగా పెళ్లయిన జంటలు కూడా సంప్రదాయ వస్త్రధారణతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఉత్సాహంగా ఓటు వేయడం విశేషం. తమిళనాడుతో పాటుగా పలుచోట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు ఓటేసేందుకు వచ్చారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటు వేయడానికి రాగా పోలింగ్ సిబ్బంది వారికి సహకారం అందించారు. నాగాలాండ్‌లోని ఒకే ఒక లోక్‌సభ స్థానానికి తొలి విడతలో పోలింగ్ జరగ్గా, ఆరు జిల్లాల ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు.

ఈ ఆరు జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఓట్లు ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక్క ఓటుకూడా పోల్ కాలేదు. ఆరు జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్‌ను పరిష్కరించనందున ఓటింగ్‌ను బహిష్కరించాలని ‘ది ఈస్ట్రర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్’ పిలుపునిచ్చింది. ఈ ఆరు జిల్లాల్లో ఆ సంస్థ పీపుల్స్ ఎమర్జెన్సీని ప్రకటించింది కూడా. మరోవైపు తమిళనాడులోని ఓటేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు ఎండ తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో రాజకీయ పార్టీలతోపాటుగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తొలి విడత ఎన్నికలకు 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 18 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.