calender_icon.png 23 October, 2024 | 3:05 PM

కాంగ్రెస్ హయాంలో ‘ప్రజాపాలన’ సంతోషాన్నిచ్చింది

18-09-2024 01:35:04 AM

టీపీసీసీ మాజీ అధ్యక్షులు వీ హన్మంతరావు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): హైదరాబాద్ రాష్ట్రం దేశంలో విలీనమైన రోజును కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం సంతోషాన్నిచ్చిందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హన్మంతరావు పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో వీహెచ్‌తో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ‘మొట్టమొద టిగా నల్లగొండ జిల్లా నుంచే రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమయ్యా యి. ఖాసింరజ్వీ నిరంకుశ విధానాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర మల్లారెడ్డి గూడెం పోరు బిడ్డలది.

చిన్న పిల్లలు సైతం వరిసెలతో రాళ్లు రువ్వి నైజాం నిరంకుశత్వాన్ని పారదోలేందుకు నడుం బిగించారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యల స్ఫూర్తితో ఎందరో పోరాటయోధులు తయారై నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1948, సెప్టెంబర్ 17న సర్దార్ పటేల్ పోరాటంతో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది’ అని పేర్కొన్నారు. విలీన దినోత్సవానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.