పార్లమెంట్ వ్యవస్థను బీజేపీ ధ్వంసం చేసింది
ఇరిగేషన్ శాఖను కేసీఆర్ సర్వనాశనం చేశారు
వచ్చే ఐదేళ్ల పాటు సుస్థిర పాలన అందిస్తాం
మీట్ ది ప్రెస్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని.. దేశ పరిస్థితి ఉత్తరకొరియా, పాకిస్థాన్ మాదిరిగా తయారవుతుందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు దేశ, రాష్ట్ర భవిష్యత్తుకు చాలా కీలకమన్నారు.
మోదీ ప్రభుత్వం పార్లమెంట్ వ్యవస్థను ధ్వంసం చేసిందని.. ప్రతిపక్షాలను అణచివేసి కీలకమైన చట్టాలను నిమిషాల్లో ఆమోదించిందని ఆరోపించారు. గత 70 ఏళ్లలో అతి తక్కువ పార్లమెంట్ సెషన్లు బీజేపీ హయాంలోనే జరిగాయని విమర్శించారు. బిల్లులపై పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ ఉండేది కాదని, తద్వారా బీజేపీ సర్కారు ప్రజల హక్కులకు భంగం కలిగించిందని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు, నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని పేర్కొన్నారు. బీజేపీకి దేశాన్ని నడపడం చేతకాదన్నారు. 2014లో రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ.. తర్వాత ఆ మాటను నిలబెట్టుకోలేకపోయిందని పేర్కొన్నారు. నిరుద్యోగం, ఉపాధి, రైతుల సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందని వివరించారు.
బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదు..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే అని ఉత్తమ్ అన్నారు. ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖను కేసీఆర్ సర్వనాశనం చేశారని, పదేళ్ల పాటు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని, కాళేశ్వరంలో విషయంలో చేసిన తప్పులకు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రకటించారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు రాలేదని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరేందుకు క్షేత్రస్థాయిలోని బీఆర్‌ఎస్ నేతలు ఆసక్తిని కనబరుస్తున్నారని, ఎన్నికల తర్వాత మరింత మంది చేరే అవకాశం ఉందని వెల్లడించారు.
అధికారంలోకి ఇండియా కూటమి..
ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై ఆరోపణలు చేయడంపై ఉత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారు.. మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు ఉన్న సమాచారం మేరకు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. నల్గొండ, భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్ల పాటు సుస్థిర పాలనను అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు మద్దతు పలకాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.