calender_icon.png 23 December, 2024 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీమార్ట్ షేర్లు డౌన్

15-10-2024 02:00:37 AM

27 వేల కోట్ల మేర క్షీణించిన మార్కెట్ విలువ!

న్యూఢిల్లీ: డీమార్ట్ పేరిట దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ షేర్లు సోమవారం క్షీణించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాల్లో మదుపర్లను మెప్పించడంలో కంపెనీ విఫలమవడంతో ఈ ఉదయం 9 శాతం మేర క్షీణించాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.27 వేల కోట్ల మేర ఆవిరైంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి డీమార్ట్ ఏకీకృత ప్రాతిపదికన రూ.659.44 కోట్ల నికర లాభాన్ని ప్రక టించింది. గతేడాదితో పోలిస్తే 5 శాతం మేర పెరిగింది. ఆదాయం సైతం 14.41 శాతం పె రిగి రూ.14,444.50 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో ఖర్చులు 14.94 శాతం మేర పెరిగినట్లు నివేదించింది. ఈ ఫలితాలు మదుపర్లను మెప్పించడంలో విఫలమయ్యాయి.

దీంతో బ్రోకరేజీ సంస్థలు డీమార్ట్ టార్గెట్ ప్రైస్‌ను తగ్గించాయి. ఈ కారణంగా డీమార్ట్ షేర్లు నేడు పతనమయ్యాయి. మరోవైపు క్విక్ కామర్స్ సంస్థల నుంచి డీమార్ట్‌కు ఎదురవుతున్న పోటీ కూడా మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

సోమవారం ఉదయం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో డీమార్ట్ షేర్లు 9.46 శాతం క్షీణించి రూ.4,139కు చేరగా.. బీఎస్‌ఈలో 9.37 శాతం క్షీణించి రూ.4,143.60 వద్ద ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.27,900 కోట్లు క్షీణించి రూ.2.69 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో డీమార్ట్ షేర్లు 8.35 శాతం క్షీణించి4,191.00 వద్ద ముగిశాయి.