04-04-2025 05:21:45 PM
రోడ్డెక్కిన ఉపాధి హామీ కూలీలు
రాజంపేట గ్రామపంచాయతీలో జాబ్ కార్డులను విలీనం చేయాలని డిమాండ్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తమకు పని కల్పించాలని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కూలీలు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గరిగెల పద్మ,పావని మాట్లాడుతూ మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు కావడంతో జనకాపూర్, ఆసిఫాబాద్ గొడవల్లి, తారకరామ నగర్ బజార్ వాడి తదితర ప్రాంతాలకు చెందిన ఉపాధి హామీ కూలీలకు ఉపాధి కరువైందనీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతాల కూలీలకు చెందిన జాబ్ కార్డులను రాజంపేట గ్రామపంచాయతీలో విలీనం చేసి పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.తమకు న్యాయం చేయకపోతే ఉధృతంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 5న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపడుతున్న విషయం తెలుసుకున్న సీఐ రవీందర్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఉపాధి హామీ కూలీలకు నచ్చచెప్పడంతో నిరసన కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు స్వరూప, కోశాధికారి మంజుల, సహాయ కార్యదర్శి సుగుణ, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.