calender_icon.png 21 April, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్యాంకర్లకు డిమాండ్

21-04-2025 01:18:59 AM

గ్రేటర్ హైదరాబాద్‌లోని ఇండ్లల్లో అడుగంటుతున్న బోర్లు

  1. వేసవి నేపథ్యంలో జలమండలి అప్రమత్తం 
  2. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
  3. వాటర్ ట్యాంకర్స్ ద్వారా నీటి చేరవేత రోజుకు సగటున 9 వేల బుకింగ్స్
  4. గత ఏడాది కంటే ఈసారి పెరిగిన డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): వేసవి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భూగర్భజలాలు అడు గంటుతున్నాయి. ఇళ్లలోని బోర్లు నోర్లు తెరిచి బావురుమంటున్నాయి. దీంతో జలమండలి అప్రమత్తమైంది. నగరవాసుల నీటి అవసరాలు తీర్చేందుకు పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నది.

ఒకవైపు రోజువారీ నల్లాల ద్వారా నీటిని సరఫరా  చేస్తూ నే, మరోవైపు అవసరమైన ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నది. నీటి ఎద్దడి నేపథ్యంలో ప్రస్తు తం వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ అమాం తం పెరిగింది. సాధారణంగా వానకాలం, చలికాలంలో గృహ, వాణిజ్య అవసరాలకు రోజుకు 2 వేల వరకు వాటర్ ట్యాంకర్ బుకింగ్స్ ఉంటాయి.

ఎండలు ముదిరి జూన్ వచ్చేవరకు బుకింగ్స్ పెరుగుతూ వస్తా యి. ఆ సమయంలో బుకింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గత ఏడాది జనవరిలో రోజుకు 2,600 బుకింగ్స్ నమోదు కాగా, ఈడాది జనవరిలో ఆ సంఖ్య 3,800గా నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరిలో రోజుకు 3,700 బుకింగ్స్ నమోదు కాగా, ఈ ఏడాది 6,574 వాటర్ ట్యాంక ర్లు బుక్ అయ్యాయి.

గత ఏడాది మార్చిలో రోజుకు 5,800 వాటర్ ట్యాంకర్స్ బుక్ కాగా, ఈ ఏడాది మార్చిలో ఆ సంఖ్య 9,100కు చేరింది. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో జలమండలి నగర పరిధిలోని మొత్తం 22 ఓఅండ్‌ఎం డివిజన్ల పరిధిలో వాటర్ ట్యాంకర్ సరఫరా వ్యవస్థను విస్తరించింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా 85 ఫిల్లింగ్ స్టేషన్లు, 138 ఫిల్లింగ్‌పాయింట్లలో నీటిని నిల్వ చేస్తున్నది. 1,094 వాటర్ ట్యాంకర్లతో రోజుకు సుమారు 9 వేల వాటర్ ట్యాంకర్లను సరఫరా చేస్తున్నది.

పెరుగుతున్న బుకింగ్స్..

వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు జలమండలి వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు, పాయింట్ల సంఖ్య పెంచింది. ఈ నెల చివరి నాటికి వాటర్ బుకింగ్స్ 10 వేలకు చేరుకోవచ్చని, మే నాటికి 12 వేలకు చేరుకోవచ్చని జలమండలి అంచనా వేస్తున్నది.

మే నెలలో నగరంలో నీటిఎద్దడి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు  గుర్తించి అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 3.68 లక్షల వాటర్ ట్యాంకర్లు డెలివరి చేయగా, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి సహా ఈ నెలలో ఇప్పటివరకు 7.15 లక్షల వాటర్ ట్యాంకర్లను సరఫరా చేసింది.

ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ డిమాండ్..

నగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఎక్కువ కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్న చోట వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ పరిధిలోని అమీర్‌పేట్, ఇబ్రహీంపట్నం, రామచంద్రాపురం, కూకట్‌పల్లి, మేడిపల్లి, తిరుమలగిరి, పటాన్‌చెరు, మారేడ్‌పల్లి, బండ్లగూడ, అల్వాల్ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. నాంపల్లి, సికింద్రాబాద్, హయత్‌నగర్ మండలాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది. దీంతో వ్యాపార అవసరాలకు యాజమానులు వాటర్ ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు.

రిజర్వాయర్లలో తగ్గుతున్న నీటిమట్టం..

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ సహా ఓఆర్‌ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, పంచాయతీ లకు జలమండలి అధికారులు పలు రిజర్వాయర్ల ద్వారా ప్రతిరోజు సుమారు 555 ఎంజీ డీల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి గడిచే కొద్దీ రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గుతూ వస్తున్నది. మే నాటికి మరింత నీటిమట్టం తగ్గే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నగరవాసులకు నీరు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.