16-04-2025 12:00:00 AM
జయప్రదం చేయాలని కార్మిక సంఘాల పిలుపు
లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 15(విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం అవలం బిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌టియు భవనంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ అధ్యక్షతన జిల్లా కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐపియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్, టియుసిఐ జిల్లా కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈనెల 20 న చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.నరేంద్ర మోడీ కార్పొరేట్ల మెప్పు కోసం కార్మిక చట్టాలను కుదించారని ఆరోపించారు.రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దుచేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, ఆర్టీసీ రిటైర్డ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.