calender_icon.png 25 September, 2024 | 3:53 AM

కార్పొరేట్ల రుణాలకు డిమాండ్

25-09-2024 12:00:00 AM

  1. పైప్‌లైన్‌లో రూ.4 లక్షల కోట్ల రుణాలు
  2. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశంలో ప్రైవేటు రంగ కార్పొరేట్లు మూలధన వ్యయాల్ని (క్యాపెక్స్) ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి పెంచుతాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి అంచనా వేశారు. తమ బ్యాంక్ వద్ద ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలు పైప్‌లైన్‌లో ఉన్నాయని వెల్లడించారు.

పీటీఐ ప్రతినిధితో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రైవేటు మూలధన వ్యయాలకు కార్పొరేట్ల నుంచి  మంచి ఆసక్తి కన్పిస్తున్నదన్నారు. ప్రధానంగా ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్‌కు డిమాండ్ ఉన్నదని, ప్రత్యేకించి రోడ్లు, పునరుత్పాదక ఇంధన పరిశ్రమల ప్రాజెక్టులు, కొన్ని రిఫైనరీలు మూలధన వ్యయాలకు ముందుకు వస్తున్నాయని శెట్టి వివరించారు.

సాధారణంగా బ్రౌన్‌ఫీల్డ్ విస్తరణను సొంత నగదు నిల్వలతో చేపట్టే కార్పొరేట్లు ఇప్పుడు వాటికి కూడా టెర్మ్ రుణాల్ని తీసుకుంటాయని తెలిపారు. తాము మంజూరుచేసి, ఇంకా పంపిణీ చేయని రుణాలు, ప్రాసెస్‌లో ఉన్న రుణ ప్రతిపాదనలు ప్రస్తుతం రూ. 4 లక్షల కోట్ల మేర ఉన్నాయని, ఈ ట్రెండ్ కార్పొరేట్ పైప్‌లైన్ పటిష్ఠతను వెల్లడిస్తున్నదని ఎస్బీఐ చైర్మన్ చెప్పారు. 

సబ్సిడరీల్లో వాటా అమ్మే యోచన లేదు

తమ సబ్సిడరీ కంపెనీల్లో ఎస్బీఐకి ఉన్న వాటాను ప్రస్తుతానికి విక్రయించే ఆలోచన లేదని శెట్టి వెల్లడించారు. ఈ సబ్సిడరీల వృద్ధికి మూలధనం అవసరమైతే తాము పరిశీలిస్తామని (వాటా విక్రయ ప్రతిపాదన) చెప్పారు. ఇప్పుడైతే తమ పెద్ద సబ్సిడరీలు వేటికీ మూలధనం అవసరం లేదని చెప్పారు. 2023-24లో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎస్బీఐ రూ.489 కోట్ల మూలధనాన్ని అందించింది.