సుష్మా, షీలా తర్వాత ఘనత సాధించిన అతిశీ
పిన్న వయస్కురాలిగా గుర్తింపు
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 18: ఢిల్లీ సీఎం పీఠం ఎవరు అధిష్టిస్తారన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు, విద్యాశాఖ మంత్రి అతిశీని నూతన సీఎంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో వారంలోగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీకి సుష్మా, షీలా దీక్షిత్ తర్వాత మూడో మహిళా సీఎం, ఢిల్లీ మఖ్యమంత్రి పదవిని చేపట్టబోయే అతిపిన్న వయస్కురాలిగా అతిశీ రికార్డులకెక్కనున్నారు.
అతిశీ పూర్తిపేరు అతిశి మార్లేనా.. 1981 జూన్ 8న ఢిల్లీలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్త వాహి ప్రొఫెసర్లుగా పనిచేసేవారు. అతిశీ హిస్టరీలో డిగ్రీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ అనంతరం అతిశీ తన కెరీర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని రిషివ్యాలీ స్కూల్‌లో టీచర్‌గా ప్రారంభించారు. ఇక్కడ 2003 జూలై నుంచి 2004 మార్చి వరకు హిస్టరీ టీచర్‌గా అతిశీ పనిచేశారు.
ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల తర్వాత..
అతిశీ కంటే ముందు ఢిల్లీ మహిళా సీఎంలుగా షీలా దీక్షిత్, సుష్మ స్వరాజ్ పనిచేశారు. షీలా తన 60వ ఏట ఢిల్లీ సీఎంగా పదవి అధిరోహించగా.. సుష్మాస్వరాజ్ 46 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఢిల్లీ చరిత్రలోనే సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన మహిళా ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ చరిత్రపుటల్లో ఎక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతిశీ (43) వీరిద్దరి కంటే పిన్న వయస్సులో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టి రికార్డు సృష్టించనున్నారు.
షీలా దీక్షిత్ 1998 నుంచి 2013వరకు 15 సంవత్సరాల పాటు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. అయితే భారతదేశ చరిత్రలో మహిళా ముఖ్యమంత్రులుగా చేసిన ప్రముఖులు.. మెహబూబా ముఫ్తీ, మాయావతి, జయలలిత, షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, మమతా బెనర్జీ, జయలలిత, రబ్రీదేవి, ఉమాభారతి, షషికళా కకోడ్కర్ తర్వాత అతిశీ మహిళా సీఎంగా రికార్టు సృష్టించనున్నారు.