calender_icon.png 8 January, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొగమంచు గుప్పిట్లోనే ఢిల్లీ

06-01-2025 01:12:01 AM

  • పొగమంచుతో కమ్ముకున్న ఢిల్లీ వీధులు 

వందలాది విమాన, రైల్వే సర్వీసులు ఆలస్యం, రద్దు

హర్యానా రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

న్యూఢిల్లీ, జనవరి 5: దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. శీతల గాలులతో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో వరుసగా రెండోరోజు నగరవాసులు తీవ్రంగా పడ్డారు. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితిని జీరో విజబులిటీగా పేర్కొనగా, ఢిల్లీలో పాలంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం తెల్లవారు 3 గంటల వరకు 9 గంటల పాటు జీరో విజబులిటీ కొనసాగింది.

ఈ శీతాకాలంలో ఇదే సుదీర్ఘమైన సమయంగా వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 8 గంటల జీరో విజబులిటీ నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా అనేక విమాన, రైల్వే సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా 250కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమవగా, 18 విమానాలు రద్దయ్యాయి.

ఆయా ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే దాదాపు 60కిపైగా రైళ్లు ఆలస్యంగా ఢిల్లీకి చేరుకున్నాయి. పొగమంచు ప్రభావం రైల్వేలపై సైతం పడింది. బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, శ్రామ్ శక్తి ఎక్స్‌ప్రెస్ సహా దాదాపు 10 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడిచాయి. ఫ్లుటై ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఆదివారం 256 విమనాలు సగటున 25 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణించాయి.

మరో 18 విమాన ప్రయాణాలను రద్దు చేశారు. శనివారం పరిస్థితి మరీ తీవ్రంగా ఉండటంతో దాదాపు 564 విమానాలు ఆలస్యం కాగా, 48 విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై ఉదయం 8 గంటల వరకు జీరో విజబులిటీ నమోదు కాగా, ఆ తర్వాత 50 మీటర్ల విజబులిటీ నమోదైంది.  భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) నివేదిక ప్రకారం ఆదివారం సఫ్దర్‌జంగ్ స్టేషన్ వద్ద ఉదయం 8.30 గంటలకు 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

డివైడర్‌ను ఢీకొట్టి నలుగురు మృతి

పొగమంచు కారణంగా సరైన విజబులిటీ లేకపోవడంతో హర్యానాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హిసార్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఉక్లా నాలోని సురేవాలా చౌక్ వద్ద తెల్లవారుజామున ప్రయాణిస్తుండగా ఓ కారు డివై డర్ ను ఢీకొంది. వెనుకనుంచి వచ్చిన మరో రెం డు కార్లు ముందున్న కారును ఢీకొన్నాయి. తర్వాత  ట్రక్కు కార్లపైకి దూసుకెళ్లింది. 

ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వేపైన..

దట్టమైన పొగమంచు కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పొగ మంచుతో విజబులిటీ తగ్గిపోవడంతో ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వేపై దాదా పు 10 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.