calender_icon.png 23 September, 2024 | 7:48 AM

ఢిల్లీ పీఠంపె ఆతిశీ

22-09-2024 12:13:10 AM

రాజ్‌నివాస్‌లో ప్రమాణం చేయించిన ఎల్‌జీ వీకే సక్సేనా 

మంత్రులుగా ప్రమాణం చేసిన మరో ఐదుగురు 

కార్యక్రమానికి హాజరైన మాజీ సీఎం కేజ్రీవాల్

షీలా, సుష్మా తర్వాత ఢిల్లీకి 3వ మహిళా సీఎంగా ఘనత

 న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ మర్లెనా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాజ్‌నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆతిశీతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్‌పై బయటికివచ్చారు.

అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు. తదుపరి సీఎంగా ఆతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఆతిశీ నేతృత్వంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్జీ సక్సేనా అంగీకరించడంతో శనివారం ప్రమాణ స్వీకా రం నిర్వహించారు. అతిశీతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. 

మూడో మహిళా సీఎంగా..

మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో గోపాల్ రాయ్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ ఉన్నారు. వీరిలో సుల్తాన్‌పూర్ మజ్రా స్థానం నుంచి గెలిచిన ముకేశ్ మొదటిసారిగా మంత్రి అయ్యారు. మిగిలిన నలుగురు నేతలు కేజ్రీవాల్ ప్రభుత్వంలోనూ మంత్రులుగా బాధ్యత లు నిర్వహించారు. రాజ్‌నివాస్‌లో కార్యక్రమానికి ముందు ఈ నేతలంతా కేజ్రీవాల్‌ను కలిశారు. కాగా, తాను నిజాయతీపరుడని ఢిల్లీ ప్రజలు ధ్రువీకరించే వరకు సీఎం పదవిని చేపట్టనని కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మూడో మహిళగా ఆతిశీ ఘనత సాధించారు. అంతేకాకుండా అతి పిన్న వయస్కురాలైన సీఎంగానూ మరో రికార్డును నెలకొల్పారు. 

మంత్రులు వీరే

గోపాల్ రాయ్: కేజ్రీవాల్ హయాంలో పర్యావరణం, అటవీ, సాధారణ పరిపాలన శాఖలను నిర్వహ్తించారు. ఆప్ ఢిల్లీ విభాగానికి కన్వీనర్‌గా ఉన్నారు. బాబాపూర్ నియోజవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

కైలాశ్ గహ్లోత్: 2015లో నజఫ్‌గఢ్ నుంచి ఢిల్లీ శాసనసభకు తొలిసారి ఎన్నికయ్యారు. కేజ్రీవాల్ పదవీకాలంలో పరిపాల నా సంస్కరణలు, రవాణా, రెవెన్యూ, చట్టం, న్యాయం, శాసనసభా వ్యవహారాలు, స్త్రీ శిశు సంక్షేమ, ఐటీ శాఖలకు బాధ్యత వహించారు. 

సౌరభ్ భరద్వాజ్: ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతకుముందు ఆరోగ్యం, పట్టణాభి వృద్ధి, పర్యాటక, కళా సంస్కృతి, భాషలు, పరిశ్రమలు, నీటి పారుదల, వరద నియంత్రణ శాఖలుగా మంత్రిగా వ్యవహరించారు. 

ఇమ్రాన్ హుస్సేన్: కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆహార, పౌర సరఫరాలు, ఎన్నికల మంత్రిగా పనిచేశారు. 2015, 2020 ఎన్నికల్లో బల్లిమారన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచా రు. 2015 ఎన్నికల్లో ఐదుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హరూన్ యూసఫ్‌ను ఓడించారు. 

ముకేశ్ అహ్లావత్: ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ మజ్రా సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేయడంతో ముకేశ్ ఆయన స్థానంలో మంత్రివర్గంలో చేరారు. గత ఏప్రిల్‌లో ఆనంద్‌కుమార్ ఆప్‌కు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి వైదొలిగారు. సుల్తాన్‌పూర్‌లో 2020లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముకేశ్.. 48 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 

ఆతిశీ నేపథ్యం

ఢిల్లీలో పుట్టిపెరిగిన ఆతిశీ మర్లెనా సింగ్ ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె 1981 జూన్ 8న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విజయ్‌సింగ్, తృప్తా వాహీ జేఎన్‌యూలో ప్రొఫెసర్లుగా పనిచేశారు. ఆతిశీ హిస్టరీలో డిగ్రీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని రిషివ్యాలీ స్కూల్‌లో టీచర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇక్కడ 2003 మధ్య హిస్టరీ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2013లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆతిశీ.. అంచెలంచెలుగా ఎదిగారు. మనీశ్ సిసోడియా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కు ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు.

ఢిల్లీలో స్కూళ్ల స్థితిగతులు మార్చడంలో కీలకంగా వ్యవహరించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కేజ్రీవా ల్ అరెస్టయిన సమయంలో పార్టీలో ఆతిశీ కీలకంగా వ్యవహరించారు. అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. ఢిల్లీ నీటి సంక్షో భం, ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసుల్లోనూ తన గళాన్ని బలంగా వినిపించారు. ఢిల్లీ క్యాబినెట్‌లో ఏకై క మహిళా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం 14 శాఖలను ఆతిశీ చూసుకున్నారు.  కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వా త ఆందరిదృష్టి ఆతిశీ పైనేవుంది