24-03-2025 01:45:19 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 23 (విజయక్రాంతి): రాజకీయ పార్టీల కుటిల నీతి బీసీలు అర్థం చేసుకున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కోరు తూ ఏప్రిల్ 2న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు ఆమో దం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం పోరాటం గల్లీలో ముగిసిందని, ఇక ఢిల్లీలో చేయబోతున్నామన్నారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా దేశంలోని 29 రాష్ట్రాల నుంచి బీసీల దండు ముట్టడించబోతుందని చెప్పా రు. ఏప్రిల్ 2వ తేదీలోగా 42శాతం బిల్లు కేంద్రం ఆమోదిస్తే అదే రోజు ఢిల్లీలో విజయోత్సవ సభ పెడతామన్నారు.
బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే పార్లమెంటులో ఆమోదించాలని సూచించారు. మోదీ మెడలు వంచి బిల్లులు ఆమోదింపజేస్తే ఎంపీలను పూజిస్తామన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు బాలగొని బాలరాజ్, విక్రమ్‌గౌడ్, మహిళ అధ్యక్షురాలు మణి మంజరి, కుల్కచర్ల శ్రీనివాస్, కనకాల శ్యాం కుర్మా, బి మని మంజరి, సింగం నగేష్‌గౌడ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.