- లైసెన్సుల జారీలో నిబంధనల ఉల్లంఘనలు
- లీకైన కాగ్ నివేదిక
- దుమ్మెత్తిపోసిన ప్రతిపక్షాలు
- తిప్పికొట్టిన ఆప్ ప్రభుత్వం
న్యూఢిల్లీ, జనవరి 11: ఢిల్లీ మద్యం పా లసీ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ పాలసీలో జరిగిన అవకతవకల కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రూపొందించిన నివేదిక లీకైనట్లు జాతీయా మీడియా కథనాలు ప్రచురించాయి. ఢిల్లీ మద్యం పాలసీ ద్వారా ఏర్పర్చు కున్న లక్ష్యాల ఛేదనలో ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం విఫలమైనట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
లీకైన నివేదిక ప్రకారం మద్యం పాలసీపై నిపుణుల కమిటీ సిఫార్సులను అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నేతృత్వంలోని మంత్రుల బృందం బేఖాతరు చేసినట్లు తెలిసింది. పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో మంత్రిమండలి, లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఆమోదం కూడా తీసుకోలేదని వెల్లడించింది. లైసెన్సుల జారీ, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు పేర్కొం ది. ఈ వ్యవహారంలో పలు ఫిర్యాదులు ఉన్నా అన్నీ సంస్థలను వేలం పాల్గొనేందుకు అనుమతించారని ఆరోపించింది.
వేలం వేసిన సంస్థల ఆర్థిక స్థితిగతులపై ఎలాంటి అధ్యయనం చేపట్టలేదని.. నష్టాల్లో ఉన్న కంపెనీలకూ అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. వారికి లైసెన్సులను కూడా పునరుద్ధరించినట్లు నివేదిక పేర్కొంది. సరెండర్ చేసిన రిటైల్ లైసెన్సులు రీటెండర్ కాక పోవడంతో ప్రభుత్వానికి రూ.890 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.
జోనల్ లైసెన్సుదారులకు ఇచ్చిన మినహాయింపుల వల్ల రూ.941 కోట్ల అదనపు నష్టం వాటిల్లిందని తెలిపింది. కొవిడ్ పరిమితుల సాకుతో జోనల్ లైసెన్సుల ఫీజులో రూ.144 కోట్లను మాఫీ చేశారని వివరించింది. ల్యాబ్‌లు, బ్యా చ్ టెస్టింగ్ సౌకర్యాలు లాంటి నాణ్యత ప్ర మాణాలు పాటించడం పాలసీ ప్రణాళికలో భాగమైనప్పటికీ ఎప్పుడూ వాటిని ఏర్పాటు చేయలేదని కాగ్ నివేదిక ధ్వజమెత్తింది.
ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు..
ఢిల్లీ ప్రభుత్వం 2021, నవంబర్ 17న మద్యం పాలసీ తీసుకొచ్చింది. 2022, సెప్టెంబర్ చివర్లో ఈ పాలసీని వెనక్కి తీసుకుంది. ఈ మధ్యలో మద్యం విధానంలో ప లు అవకతవకలు జరిగాయని, ఆప్ నేతలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఎక్సైజ్ పాలసీని సవరించే క్రమం లో సిసోడియా అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీలు ఆరోపించాయి.
లైసెన్స్‌దారులకు అవసరమైన సాయం చేసి, వారి నుంచి ఆర్థిక లబ్ధి పొందినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ కుంభకోణంలో ఢిల్లీ మా జీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా సహా ఇతర ఆప్ నేతలను అధికారులు అరెస్ట్ చేశారు. కొంతకాలం క్రితం వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నివేదికలో పేర్కొన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
కుంభకోణం సుస్పష్టం: కాంగ్రెస్
లీకైన కాగ్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ సీఎం శీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ స్పందించారు. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారనే విషయం కాగ్ నివేదికతో స్పష్టమైందన్నారు. మద్యం పాలసీలో రూ.2వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని కాగ్ నివేదికలు వెల్లడిస్తున్నాయని.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేశాడని.. ప్రభు త్వ ఖజానాను ఖాళీ చేశారని తేలిందన్నారు. మద్యం పాలసీ పేరుతో 6 నెలల్లో రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఆ పథకం ఇంకా అమలులో ఉంటే ఢిల్లీకి దాదాపు రూ.12వేల కోట్ల నష్టం వాటిల్లేదని ఆరోపించారు.
నివేదిక ఎక్కడుందో చూపాలి..
ఢిల్లీ మద్యం కేసులో ఆప్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలను ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ సం జయ్ సింగ్ తిప్పికొట్టారు. కాగ్ ఇంకా నివేదికను సమర్పించలేదని బీజేపీనే స్వయంగా అంగీకరించిందని, నివేదికే నిజమైతే అది ఎక్కడుందో చూపించాలని సవాలు విసిరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీపై బురదజల్లి, రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నారని వాపోయారు.
విరుచుకుపడ్డ బీజేపీ..
ఢిల్లీ మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక లీకైన విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. ఈ నివేదిక ఆప్ నేతల అవినీతిని బట్టబయలు చేసిందని ఆరోపించారు. ఆప్ నేతలు ఉద్దేశపూర్వకంగా చేసిన పనులతో రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఢిల్లీ ప్రజల ఖజానాను లూటీ చేసిన ఆప్ నేతలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
లీకైన కాగ్ నివేదికపై కేజ్రీవాల్ సమాధానం చెప్పాలని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో నాణ్యమైన విద్యనందిస్తామని, అందుకోసం పాఠశాలలను నెలకొల్పుతామన్న ఆప్ ప్రభుత్వం, అందుకు బదులు మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. స్వరాజ్ నుంచి షరాబ్‌కు మారారని ధ్వజమెత్తారు. పదేండ్ల ఆప్ పాలనలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయన్నారు.