03-05-2024 12:30:20 AM
ఢిల్లీ మహిళా కమిషన్
ఉద్యోగులపై వేటు వేసిన ఎల్జీ
ఉద్యోగుల తొలగింపు తుగ్లక్ చర్య : కమిషన్ మాజీ చైర్‌పర్సన్ స్వాతి
న్యూఢిల్లీ, మే 2: ఢిల్లీ మహిళా కమిషన్ పరిధిలోని 223 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులపై వేటు వేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో ఆమె నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని వచ్చిన ఆరోపణలపై వచ్చాయి. దీంతో ఉద్యోగులను ఎల్జీ తొలగించారు. ప్యానల్‌కు 40 మందిని మాత్రమే నియమించే అధికారం ఉంద ని, నిబంధనలకు విరుద్ధంగా 223 మం ది నియామాకాలు జరిగాయని ఎల్జీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థికశాఖ అనుమతులు లేకుండా కొత్తగా నియమ కాలు చేపట్టడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పారు.
ఉద్యోగుల తొలగింపుపై ఎంపీ స్వాతి మాలివాల్ స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ‘తుగ్లక్ చర్య’గా పేర్కొన్నారు. మహిళా కమిషన్ కోసం రక్త మాంసాలు పెట్టి పనిచేస్తున్న ఉద్యోగులను తెలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోకపోగా, కమిషన్ వినాశనాన్ని కోరుకోవడం వికృత చర్య అని అభిప్రాయపడ్డారు. ప్యానల్‌లో మొత్తం 90 మంది సభ్యులు ఉండగా, వీరిలో ఎనిమిది మందిని మాత్రమే ప్రభుత్వం నియమించిందని, మిగతావారంతా కాంటాక్ట్ ఉద్యోగులేనని స్పష్టం చేశారు. వారు విధులు నిర్వహించకపోతే ఇక మహిళ కమిషన్ కార్యాలాయానికి తాళం వేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.