15-11-2024 12:00:00 AM
దేశ రాజధాని నగరం తీవ్రమైన కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతోంది. వరసగా గత రెండు రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో వాయు నాణ్యత 400కు పైగా చేరుకుని ‘తీవ్ర కేటగిరీ’లో కొనసాగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) ప్రకా రం దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 500కు చేరువయింది. ఫలితంగా విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో రోడ్లపై వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించక ఇబ్బందులు పడ్డారు.
ఇది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే సుమారు 300 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లుటైరాడార్ 24 సంస్థ తెలిపింది. మరికొన్నింటిని దారి మళ్లించారు. పొగమంచు రైళ్ల రాకపోకలపైనా ప్రభా వం చూపుతోంది. మితిమీరిన వాయుకాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రభు త్వం అప్రమత్తమయింది. శుక్రవారంనుంచి యాక్షన్ ప్లాన్ ‘జీఆర్‌ఏపీ’ మూడో దశను అమలు చేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ నిర్ణయించింది.
ఈ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో అన్ని భవన నిర్మాణ పనులు, కూల్చివేతలను నిలిపివేస్తారు. అలాగే నాన్ ఎలక్ట్రిక్, నాన్ సీఎన్‌జీ అంతర్రాష్ట్ర బస్సులను కూడా పరిమితం చేస్తారు. దీని తో పాటుగా బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ ఫోర్‌వీలర్స్‌పైనా నిషేధం విధించనున్నారు. ఢిల్లీఎన్‌సీఆర్ పరిధిలోని 5వ తరగతి లోపు పాఠశాలలను మూసివేయనున్నారు. అంతేకాదు తదుపరి ఆదేశాలు జారీ చేసేవ రకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు.అయితే ఈ చర్యలేవీ ఢిల్లీ వాయుకాలుష్యం తగ్గడంలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. మహా అయితే తీవ్రత మరింత పెరగకుండా చూడవచ్చు. ఢిల్లీలో ఉంటున్న వాళ్లు ప్రస్తుతం ‘గ్యాస్ చాంబర్’లో ఉన్నట్లుగా ఉందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు సమస్య తీవ్రతకు అద్ద పడుతున్నాయి. అయితే అక్టోబర్ 14నుంచి 300 దరిదాపుల్లోనే ఉన్న గాలి నాణ్యత ఒక్కసారిగా క్షీణించడానికి పొడి వాతావరణమే కారణమని నిపుణులు అంటున్నారు.
గాలి వేగం తక్కువగా ఉండడంతో ధూళి రేణువులు వంటివి గాలిలో అలాగే నిలిచిపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఉత్తర భారతమంతటా కూడా దట్టమైన పొగమంచు కమ్మేసి ఉందని శాటిలైట్ చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితి డిసెంబర్ నాటికి మరింత తీవ్రమవుతుందని కూడా అంటున్నారు. మరోవైపు యమునా నది కాలుష్యం దీనికి తోడయింది. దీంతో నగర ప్రజలు శ్వాససంబంధమైన పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీలయినంత వరకు ఉదయం పూట బైటికి వెళ్లవద్దని, ఒక వేళ వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే నగర జనాభాలో 25 శాతం మంది పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం బయటి రాష్ట్రాలనుంచి వచ్చిన వారే. చాలా మందికి రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌లపై గుడిసెలే ఇళ్లు. ఉదయాన్నే పనులకు వెళ్లక పోతే ఆ రోజు వీరికి ఉపవాసమే. అలాంటి పరిస్థితిలో వారు వైద్యులు చెప్పే జాగ్రత్తలు పాటించడం ఆచరణలో సాధ్యమా? అందుకే వందలాది మంది గొంతునొప్పి, జ్వరం వంటి శ్వాససంబంధమైన సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
ఆనవాయితీగా మారిన ఈ వాయుకాలుష్యంనుంచి తప్పించుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్లాలని నగర జనాభాలోని దాదాపు 40 శాతం భావిస్తున్నట్లు ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. అయితే అది సమస్యకు పరిష్కారమవుతుందా? దేశ రాజధానిని పట్టిపీడిస్తున్న సమస్యకు పరిష్కారం కనుగొనలేక పోతే ఇంతకన్నా పెద్ద సమస్యలను పాలకులు ఎలా పరిష్కరిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గంగానది శుద్ధిలాంటి బృహత్కార్యాన్ని అమలు చేస్తున్న మోదీ సర్కార్ ఢిల్లీ వాయుకాలుష్యం సమస్యకు కూడా యుద్ధప్రాతిపదికన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తే తప్ప పరిష్కారం లభించదు. అప్పటివరకు దేశ రాజధాని పౌరులకు ఈ బాధలు తప్పవు.