శీతాకాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని ఢిల్లీ నగర వాసులకు కష్టాలు మొదలవుతాయి. ఢిల్లీలో వాయునాణ్యత క్షీణించడంతో గత వారం, పది రోజులుగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ఉదయపు నడక వంటి కార్యకలాపాలకు దూరంగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక చిన్నపిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ, కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాలి కాలుష్యాన్ని నియంత్రించడానికి నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ చర్యలు మొదలు పెట్టింది.
అయినప్పటికీ ఈ చర్యల ప్రభావం నామమాత్రంగానే ఉంటోంది. మంగళవారం సైతం దేశ రాజధానిలో గాలి నాణ్యత 272 ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)తో ‘ పేలవమైన’ కేటగిరీలోనే ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా వెల్లడించింది. మొత్తం 40 మానిటరింగ్ స్టేషన్లనుంచి డేటాను సేకరించగా పది స్టేషన్లలో గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేట గిరీలో ఉంది. ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్మేస్తుండడంతో పనుల నిమిత్తం రోడ్లపైకి వచ్చిన జనం ఊపిరి పీల్చుకోవడంలో సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. దీనికి తోడు వాహనాలనుంచి వచ్చే పొగ కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మరోవైపు పెద్ద ఎత్తున సాగుతున్న భవన నిర్మాణ పనుల కారణంగా కూడా కాలుష్యం పెరిగిపోతున్నది. దీని కి తోడు పొరుగు రాష్ట్రాలయిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు కోతల అనంతరం పంట వ్యర్థాలను పెద్ద ఎత్తున తగులబెట్టడం కారణంగా ఆ పొగ అంతా ఢిల్లీని కమ్మేసి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.
ఏటా ఈ బెడద రెండు నెలలకు పైగా కొనసాగడం పరిపాటి. ఇతర రాష్ట్రాలనుంచి ఉపాధి కోసం వచ్చిన పేద ప్రజల కష్టాలు వర్ణనాతీతం. వాయుకాలుష్యానికి తోడు యమునా నదిలో కాలుష్యం కూడా జనాన్ని భయపడుతోంది. నగరం చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలనుంచి పెద్దఎత్తున రసాయన కాలుష్యాలు నదిలో కలుస్తుండడంతో నది అంతా నురగమయంగా మారిపోతోంది. నది నీరు తాగడానికి అటుంచి కనీసం స్నానం చేయడానికి కూడా పనికి రాని విధంగా కలుషితమైందని నిపుణులు అంటున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే దీపావళి రోజుల్లో వాయు కాలుష్యం తీవ్రత మరింత పెరిగిపోతుందేమోనని భయపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుగానే నగరంలో బాణాసంచా విక్రయాలను పూర్తిగా నిషేధించింది. నిషేధం ఉన్నా జనం మాత్రం ఏదో ఒక మార్గంలో బాణాసంచా కాల్చడం ఖాయమని అధికారులు అంటున్నారు.
ఢిల్లీ నగరానికి వాయుకాలుష్యం బెడద ఈ నాటిది కాదు. గత కొన్నేళ్లుగా జనం ఈ సీజన్‌లో వాయుకాలుష్యం కారణంగా అవస్థలు పడుతూ నే ఉన్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని రికార్డులకెక్కింది. ఇదే స్థాయిలో వాయుకాలుష్యం కొనసాగితే ఢిల్లీవాసుల జీవితకాలం పదేళ్లు తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల క్రితమే హెచ్చరించింది. అయినా పరిస్థితి మెరుగుపడలేదు సరికదా మరింత క్షీణించింది. ఢిల్లీలో వాయుకాలుష్యంపై పలు సంఘాలు, వ్యక్తులు సుప్రీంకోర్టుకు సైతం వెళ్లారు.
నగరంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణమైన పంటవ్యర్థాల దగ్ధాన్ని కట్టడి చేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశించిం ది. అయినప్పటికీ ఆ దిశగా పెద్దగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఆప్ ప్రభుత్వం కూడా ఏటా సమస్య వచ్చినప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకోవడం తప్ప శాశ్వత పరిష్కారాల గురించి ఆలోచించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాల మధ్య కోటికి పైగా ఉన్న నగర ప్రజలు నలిగి పోతూనే ఉన్నారు. అయినా సమస్యకు పరిష్కారం మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు.