09-02-2025 01:51:05 AM
తెలంగాణ మేధావులు ఆలోచించి ఓటేయండి
కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): అక్రమ దందాలకు పాల్పడిన ఆమ్‌ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు చీపురుతో ఛీ కొట్టి, ఊడ్చిపరేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీ మాదే.. తెలంగాణతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోయేది బీజేపీనే..
త్వరలో ఇక్కడ మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోబోయేది మేమే’ అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘చీపురుతో ఛీ కొట్టారు. చేతిని చిదిమేశారు. కమలాన్ని వికసింపజేశారు.
ఢిల్లీ అయినా.. గల్లీ అయినా బీజేపీదే. ప్రధాని నరేంద్రమోదీతోనే మేమం తా అని చాటిచెప్పిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. అక్రమ దందాలతో జైలుకెళ్లిన నాయకుడు మాకొద్దు.. నీతిమంతమైన మోదీ పాలన ఢిల్లీలోనూ రావాలని ప్రజలు ఆకాంక్షించారని, అందుకే వార్ వన్‌సైడ్ అన్నట్టు ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు.
తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని, ప్రశ్నించే పార్టీ బీజేపీ అని చెప్పారు. ఢిల్లీలో బీజేపీని ఆదరించినట్లే.. తెలంగాణలోని మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులంతా ఆలోచించి కమలానికి ఓటేయాలని కోరారు.