చెరువలైన రహదారులు
కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్
న్యూఢిల్లీ, జూలై 31: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన వర్షానికి నగరంలో చాలాప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. నడుములోతు నీళ్లు నిలిచిపోవటంతో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు వర్షంలో తడుస్తూ నరకం అనుభవించారు. వాతావరణం అనుకూలించకపోవటంతో ఢిల్లీలో దిగాల్సిన విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వే, మథుర రోడ్డు, ఐటీవో, ఎయిమ్స్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులను ఆదేశించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తు న్నామని ఢిల్లీ మంత్రి ఆతిషీ ప్రకటించారు.