08-02-2025 08:07:48 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు మోదీకి ఘన స్వాగతం పలికారు. పలువురు నేతలు మోదీని గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిందని, ఢిల్లీ ప్రజలకు ఈ రోజు పండగలాంటిదని పేర్కొన్నారు. శనివారం వెల్లవడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందన్నారు. బీజేపీపై విశ్వాసం ఉంచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీ విశ్వాసాన్ని అభివృద్ధి రూపంలో తీసుకొస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.
ఇకపై డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఢిల్లీలో అభివృద్ధి ఢిల్లీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. ఈ విజయం కోసం ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడ్డారని ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను తిరిగి అనేక రెట్లు వారికిస్తామన్నారు. ఢిల్లీలో విజయం సాధారణమైన విజయం కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీని వికసిత్ రాజధానిగా మార్చే అవకాశం ఇచ్చారని, అవినీతి, అహంకార ఆప్ ను దశాబ్దం తర్వాతైన దించేశారు.ఢిల్లీ ప్రజలు చాలా స్పష్టమైన తర్పు ఇచ్చారని, ఇక నుంచి ఢిల్లీలో వికాస్, విజన్, విశ్వాస్ నినాదాలతో పరిపాలన కొనసాగుతుందన్నారు. వరుసగా మూడు లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని, అడ్డదారిల్లో వచ్చిన వారికి ఢిల్లీ ప్రజలు షాక్ ఇచ్చారని మోదీ వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రతి ఎన్నికలో బీజేపీ దూసుకెళ్తోందని, హరియాణా, మహారాష్ట్రంలో బీజేపీ ఘన విజయాలు సాధించిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఢిల్లీలో ఉంటారని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో గెలిచామంటే దేశమంతా బీజేపీని దీవించినట్లే అన్నారు.