22-04-2025 11:53:04 PM
‘హమ్దార్ షర్బత్’పై వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హమ్దార్ షర్బత్‌పై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేశాయని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే రాందేవ్ బాబా పోస్ట్ చేసిన వీడియోను తొలగించాలని ఆదేశించింది. ఏప్రిల్ 3న పతంజలి గులాబ్ షర్బత్‌ను ప్రమోట్ చేస్తూ విడుదల చేసిన వీడియోలో..‘హమ్దార్ షర్బత్ తాగితే ఆ డబ్బులతో మసీదులు, మదర్సాలు నిర్మిస్తారు.
అదే పతంజలి తయారు చేసే గులాబ్ షర్బత్ తాగితే గురుకులాలు, పతంజలి యునివర్సిటీ, భారతీయ శిక్షా బోర్డ్ నిర్మాణాలు జరుగుతాయి’ అని రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ రికార్డ్ చేసిన వీడియోకు ‘షర్బత్ జిహాద్’ అని పేరు పెట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఆయన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. గతంలోనూ తప్పుదోవ పట్టించే ప్రకటనల వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్ సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.