01-03-2025 11:36:19 PM
మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం బంద్...
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని రోజులకే కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా 15 ఏళ్లకు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పర్యావరణ శాఖ మంత్రి మన్‌జిందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్ బంకుల వద్ద గాడ్జెట్‌లు ఏర్పాటు చేస్తాం. 15 ఏళ్లు పైబడిన వాహనాలను అవి గుర్తిస్తాయి. దాంతో వాటికి ఇంధనం అందదు’ అని వెల్లడించారు. ఈ ఆంక్షలకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖకు సమాచారం ఇస్తామని తెలిపారు.
అలాగే ఎత్తున భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో యాంటీ స్మోక్ గన్‌లను తప్పనిసరిగా అమర్చాలని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 90 శాతం సీఎన్‌జీ బస్సులను దశలవారీగా ఉపసంహరించుకొని ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన తుక్కు విధానాన్ని కొత్త ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తుక్కు విధానం వల్ల ఫిట్‌నెస్ లేని వాహనాలకు స్వస్తి పలకడంతో పాటు కాలుష్యం తగ్గడానికి దోహదపడనుంది.