కోలీవుడ్ సీనియర్ నటుడు ఢిల్లీ గణేశ్ (80) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధా ప్యం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున చెన్నై లోని రామాపురంలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తూత్తుకుడిలో జన్మించిన ఢిల్లీ గణేశ్ 1976లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
దక్షిణభారత నాటక సభ అనే ‘ఢిల్లీ’ థియేటర్ గ్రూప్‌లో సభ్యుడైన ఆయన సినిమాల్లో నటించడానికి ముందు 1964 నుంచి 1974 వరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 400కు పైగా సినిమాల్లో నటించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ప్రతిభ చాటారు. ‘పట్టినప్రవేశం’ (1977)తో దర్శకుడు కే బాలచందర్ ఆయనను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
ఢిల్లీ గణేశ్ పోషించినవి.. చాలావరకు సహాయ నటుడు, హాస్యనటుడి పాత్రలే. ఆయన సినిమాలు తెలుగులో విడుదలకావడంతో ఇక్కడి ప్రేక్షకులకూ ఆయన చేరువైపోయారు. 1979లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.
1993--1994 సంవత్సరానికి గాను ‘కలైమామణి’ అవార్డును సైతం ఆయన అందుకున్నారు. ఇటీవల ‘ఇండియన్ 2’, ‘కాంచన 3’, ‘అభిమన్యుడు’ తదితర సినిమాల్లో కనిపించారు ఢిల్లీ గణేశ్. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఢిల్లీ గణేశ్ మృతిపై సంతాపం తెలిపారు.