calender_icon.png 3 October, 2024 | 5:55 AM

ఢిల్లీ గాంధీలు రేవంత్ సర్కారు పాలనపై స్పందించాలి

03-10-2024 01:46:16 AM

గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఈ గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఉన్న ప్రస్తుత గాంధీలు రాష్ట్ర ప్రభుత్వ అమానవీయ పాలనపై స్పందించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. డీపీఆర్ కూడా లేకుండా ఇండ్లు కూలగొట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గ ప్రయత్నాలను విరమింపచేయాలని విజ్ఞప్తి చేశారు.

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో వారి చిత్రపటాలకు కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యాగ్రహంతో భారత జాతినే కాకుండా ప్రపంచాన్ని మేల్కొల్పిన గొప్ప మహనీయుడు గాంధీ అని అన్నారు.

అత్యంత బలహీనమైన వ్యక్తిని, ఆ సమాజం, ఆ ప్రభుత్వం ఎట్లా ఆదరిస్తున్నదనే దాన్నిబట్టి ఆ ప్రభుత్వం గొప్పతనం తెలుస్తుందని మహాత్ముడు చెప్పారని.. ఈ మాట సరిగ్గా రేవంత్ సర్కారుకు ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. ప్రజలపట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన పంథాపై పునరాలోచించుకోవాలని సూచించారు.

ఇండ్లు కూల్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకువచ్చిన కూలీలు కూడా ఇల్లు కూలగొట్టలేమంటూ తిరిగి వెళ్లిపోయారని తెలిపారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది నిర్మాణాత్మక పనులు చేయమని కానీ విధ్వంసం సృష్టించమని కాదనే విషయాన్ని రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలని అన్నారు. మానవత్వంతో ముందడుగు వేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.