న్యూఢిల్లీ, జనవరి 6: ‘నా తండ్రి ఒక టీచర్. ప్రస్తుతం ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకరి సాయం ఉంటే తప్ప కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు ఒక వృద్ధుడిపై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా? రాజకీయాలు ఇంత దారుణంగా ఎలా ఉంటాయి? నా తండ్రిపై బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి’ అని ఢిల్లీ సీఎం అతిశీ భావోద్వేగానికి గురయ్యారు.
‘సీఎం అతిశీ ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా, ప్రస్తుతం ఆమె మరో ఇంటిపేరు వాడుతున్నారు. ఆమె కుటుంబం గతంలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది’ అంటూ బీజేపీ నేత రమేశ్ బిధూరి ఆదివారం వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం సీఎం అతిశీ మీడియా సమావేశం నిర్వహించారు. ఓట్ల కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయంటే నమ్మలేకపోతున్నానని వెల్లడించారు. బీజేపీ నేత రమేశ్ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అతిశీ ప్రాతినిధ్యం వహిస్తున్న కల్కాజీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు.