నాసా విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల్లో ఢిల్లీ, లాహోర్ నగరాలపై పొగమంచు
- ‘నాసా’ శాటిలైట్ చిత్రాల్లో కనిపించని భూభాగం
- దట్టమైన పొగమంచుతో కనిపించిన నగరాలు
న్యూయార్క్, నవంబర్ 11: భారత రాజధాని ఢిల్లీ, తూర్పు పాకిస్థాన్‌లోని లాహోర్ నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. రెండు నగరాల్లో కాలుష్యం ఏ స్థాయిలో ఉందంటే తాజాగా ‘నాసా’ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల్లో ఆ రెండు నగరాల భూభాగమే కనిపించలేదు. రెండు నగరాలను దట్టమైన పొగమంచు కమ్మేసిన చిత్రాలు ఇప్పుడు నెట్టింట వైరలయ్యాయి. లాహోర్ నగర పరధిలో ఇప్పటికే కాలుష్యం స్థాయి 1,165 గా నమోదైంది.
ముఖ్యంగా పంజాబ్ ప్రావీన్స్‌లో కాలుష్య ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. కాలుష్యం దెబ్బతో అక్కడి ప్రభుత్వం ఈ నెల 17 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. పార్క్‌లు, జంతు ప్రదర్శనశాలలు, మైదానాలు, మ్యూజియంలను మూసివేయించింది. అలాగే ఢిల్లీని సైతం అదేస్థాయిలో కాలుష్యం చుట్టుముట్టింది.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ నగరాల ప్రజలు అతిత్వరలో హృద్రోగాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలకు గురవుతారని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరిస్తున్నది. చిన్నారులు, వృద్ధుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ఘంటాపథంగా చెప్తున్నది.