పాండవుల చెరువు పరిశీలించి రెండు నెలలు
ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వెనక్కితగ్గిన అధికారులు?
గజ్వేల్, అక్టోబర్ 8: పాండవుల చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి సర్వే చేయంలో అధికారు లు తీవ్ర అలసత్వం వహిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గజ్వేల్ ప్రజ్ఞా పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ పాండవుల చెరువు ఎఫ్‌టీఎల్ భూముల్లో అక్రమ నిర్మాణాల గురించి గతంలో విజయక్రాంతి దినపత్రిక ‘పాండవుల చెరువు నోట్లో మట్టి’ అనే శీర్షికన వరుస వార్తాకథనాలు ప్రచురించగా.. అధికారులు స్పందించి చెరువును పరిశీలించారు.
సర్వేకు అవసరమైన పరికరాలు, పాతకాలం నాటి మ్యాప్‌లను తెప్పించే ప్రయత్నాలు కూడా చేశారు. అయి తే చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతాన్ని పరిశీలించి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు సర్వే మాత్రం చేయలేదు.
పాండవుల చెరువుతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని పలు చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్ భూముల్లో కూడా అక్రమ నిర్మాణాలు, వెంచర్లు వెలిసినట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇరి గేషన్ అధికారులు చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో కొందరు ప్రజాప్రతినిధులు.. చెరువులు, కుంటల వైపు వెళ్లొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు ఎఫ్‌టీఎల్ భూములను సర్వే చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.