సమన్లు ఎందుకు జారీ కావడం లేదని ప్రశ్న
ప్రభుత్వ తీరును తప్పుపట్టిన హైకోర్టు
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై దాఖలైన కేసుల విచారణ ఆలస్యం కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు నిందితులుగా ఉన్న కేసుల్లో నిందితులకు, సాక్షులకు సమన్లు ఎందుకు జాప్యం అవుతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆ కేసుల్ని సత్వర విచారణ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. గత విచారణ నాటికి, ఇప్పటికి కేసుల విచారణలో పెద్దగా పురోగతి లేదని పేర్కొన్నది. నిందితులకు, సాక్షులకు సమన్ల జారీకి చేపట్టిన చర్యలను తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ కేసులో ఎమ్మెల్యేలు ఎంపీలపై నమోదైన కేసులను సత్వర విచారణ చేయాలని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ జారీచేసిందని గుర్తుచేసింది.
విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రీ తరఫు సీనియర్ అడ్వొకేట్ విద్యాసాగర్ అందజేసిన స్టేటస్ రిపోర్టులో రాష్ట్రవ్యాప్తంగా 1,115 కేసులుంటే 46 సమన్లు జారీకావాలని తెలిపారు. నెల రోజుల్లో కేవలం 9 సమన్లు మాత్రమే జారీ అయ్యాయని, ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. వారంతా కళ్ల ముందే తిరుగుతున్నారని వ్యాఖ్యానించింది. వివరాల సమర్పణకు సమయం కావాలని అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోరడంతో విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది.