calender_icon.png 22 October, 2024 | 11:38 PM

రోడ్డు పనుల్లో జాప్యం.. ప్రయాణికులకు శాపం

09-08-2024 12:42:12 AM

  1. భారీ వర్షాలతో ప్రధాన మార్గాలు బురదమయం 
  2. దిగబడుతున్న  లారీలు.. రాకపోకలకు అంతరాయం

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 8(విజయక్రాంతి): వానకాలానికి ముందే పూర్తి చేయాల్సిన రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో  వానల ధాటికి ఆయా మార్గాలు బురదమయంగా మారుతున్నాయి. బురదలో వాహనాలు దిగబడి కదల్లేక పోతుండడంతో ఆ మార్గాల్లో గంటల తరబడి వాహన రాకపోకలు నిలిచిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, కాటారం మార్కెట్ యార్డు  ధన్వాడ వరకు రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి.

వానకాలాని కి ముందే పనులు పూర్తి కావాల్సి ఉండగా.. పనుల్లో జాప్యం జరిగింది. సాధారణంగా కాటారం నుంచి మంథని వైపు, మంథని వైపు నుంచి కాటారం వైపు నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. తాడిచర్ల  చెల్పూర్ కాకతీయ థర్మల్ ఫ్లాంట్‌కు ఈ మార్గం గుండానే లారీలు బొగ్గు తరలిస్తుంటాయి. రహదారిపై బురద నిలిచి ఉండడం తో లారీలు చిత్తడిలో దిగబడుతున్నాయి.

రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఒకవైపు మెటల్ గ్రావెల్ పనులు జరుగుతుం డగా, మరోవైపు పెద్ద కందకాలు తీసి మొరం మట్టి చదును చేసే పనులూ కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ పనులను నత్తనడకన సాగించడంతో ఈ దుస్థితి నెలకొందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. 

గురువారం ఈ రహదారిలో ఓ లారీ బురదలో దిగబడటంతో సుమారు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్, అధికారులు కొన్ని గంటల పాటు శ్రమించి జేసీబీ సాయంతో దిగబడిన లారీని బయటకు తీయించారు. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని దుమ్ము లేవకుండా బురద కాకుండా మెటల్ వేసి ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.