- మృతుల కుటుంబ సభ్యుల ఆందోళన
జయశంకర్ భూపాలపల్లి, జూలై 24 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని రాజీ కుదుర్చుకొని పరిహారం ఇవ్వడంలో జాప్యం చేసిన వ్యక్తి.. దుకాణం ఎదుట మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గతనెల కమలాపూర్ వద్ద బైక్‌ను కారు ఢీ కొట్టిన సంఘటనలో కమలాపూర్‌కు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన మణికంఠ ట్రేడర్స్ యజమాని బందం మహేష్‌రెడ్డి మృతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు ఒప్పందం కుదుర్చకుని రాజీపడ్డారు.
అయితే సాయం అందించడంలో ఆలస్యం చేయడంతో ఆగ్రహించిన మృతుల కుటుంబ సభ్యులు భూపాలపల్లి లోని అతడి దుకాణం ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ.. తమకు నష్టపరిహారం ఇచ్చేవరకు ఆందోళన విరమించమని భీష్మించుకుని కూర్చోవడంతో సదరు వ్యక్తి ఒప్పుకున్న మేరకు ఆర్థికసాయం చెల్లించేందుకు ముందుకు రావడంతో ఆందోళన సద్దుమణిగింది.