25-03-2025 01:04:03 AM
కరీంనగర్, మార్చి 24 (విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో సర్వర్ మోరాయించడంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో జాప్యం జరిగింది. సాంకేతిక కారణాలతో ఆన్లైన్ మొరాయించడంతో రెండు గంటలపాటు ప్రజావాణి కార్యక్రమం నిలిచిపోయింది. దీంతో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన దరఖాస్తుదారులు కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కింద వేచి ఉన్నారు. అనంతరం సమస్య సద్దుమనగగా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్లతో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణి ఆశ్రయిస్తున్నారని, ఎన్నో వ్యయ ప్రయాసలతో ఇక్కడికి వస్తున్న వారి దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు.
సంబంధిత అధికారులు శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులతో పాటు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 169 దరఖాస్తుల స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి కిరణ్, ప్రఫుల్ దేశాయి, మున్సిపల్ కమిషనర్ చాహత్ భాజ్ పాయి, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు రమేష్, మహేశ్వర్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.