నేడు బాలగోపాల్ వర్ధంతి :
అసాధారణ మేదస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్దాటి రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం, మానవీయతా సుగుణం మొదలైన లక్షణాలన్నింటినీ మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు.
1977--78లలో వరంగల్‌లో హక్కుల గురించి, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం గొప్ప ప్రజాస్వామిక ఉద్యమాలు జరిగాయి. రాడికల్ విద్యార్థి సంఘం నాయకులు సూరపనేని జనార్ధన్ ఎన్‌కౌంటర్, జన్ను చీన్నాలు హత్యానంతరం రాడికల్స్ నాయకత్వంలో చేస్తున్న పోరాటాలకు సంబంధించి ముఖ్యంగా నర్సంపేట, నల్లబెల్లి ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు, భూములు లేని నిరుపేదల పోరాటాల కోసం రూపొందించిన కరపత్రాల ఆధారంగా బాలగోపాల్ మొట్టమొదటగా ఒక వ్యాసం రాశారు.
ఆయన ఆ పోరాటాలను ‘దూరంగా ఉండేవాళ్లకు, రెండు ఎర్రజెండాల మధ్య ఘర్షణగా కనిపించేది, నిజానికి కొత్తగా ఏర్పడుతున్న ధనిక వర్గానికి, పై మెట్టుకు ఎగబాకుతున్న మధ్యతరగతి వర్గానికి, భూములు లేని నిరుపేద దళితులకు మధ్య జరుగుతున్న వర్గ పోరాటాలు’ అని విశ్లేషించారు. ఆ తర్వాత బాలగోపాల్ ‘తాను కూడా ప్రజల కోసం ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేయాలి’ అని బలంగా నిర్ణయించుకొని 1981లో ‘ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం’లో చేరారు.
ప్రజలకు వారధి సంస్థకు సారథి
బాలగోపాల్ రాస్తున్న వ్యాసాలు, చేస్తున్న ప్రసంగాలు మొదలైన వాటి కారణంగా 1981లోనే ఆయనను నేరుగా ‘పౌర హక్కుల సంఘం’ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. 1983లో ఖమ్మంలో జరిగిన పౌర హక్కుల రాష్ట్ర 2వ మహాసభలో బాలగోపాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఎన్‌కౌంటర్లు, చిత్రహింసలు, లాకప్ మరణాల గురించి రిపోర్టులు ప్రచురిస్తూ సంస్థ నిర్మాణంపైనా ఆయన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. బాలగోపాల్ సంఘటన జరిగిన స్థలానికి వెళ్లడం, బాధితులు, అక్కడి ప్రజలతో మాట్లాడి పత్రికలలో ప్రకటనలు ఇచ్చి వెనుదిరిగి వెళ్లిపోవడం మాత్రమే కాకుండా ప్రజలను ఏ మాత్రం చైతన్య పర్చగలం అనేది కొలబద్దగా ఆయన కార్యచరణగా ఉండేది.
ఆయన ఏది చేసినా చేసే పనిలో ప్రచారం కన్నా కూడా ప్రజల్లో చైతన్యాన్ని ఏ మేరకు తీసుకురాగలమన్న అవకాశాలనుబట్టి ఉద్యమించాలని, ఆ దిశగా తాను ఒక్కడిగా మాత్రమే కాకుండా మొత్తం సంస్థని కూడా ఆయన ముందుకు నడిపించారు.
‘హక్కుల ఉద్యమం’ అనేది ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగానో లేదా ఒక రాజకీయ పార్టీ తాలూకు విలువల కోసం పనిచేయడమో లేదా దాని కార్యక్రమాలలో భాగంగా పనిచేయడమో లేదా కొంద రి కోసం పని చేయడమో అనేది కాకుండా మొత్తంగా సమాజంలోని ప్రజల కోసం ముఖ్యంగా స్వేచ్ఛ, సమానతా అనే భావనల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన సూత్రీకరించారు. రాజకీయాలకు లోబడి పనిచేసే హక్కుల సంఘం రాజకీయ ఉద్యమంలో భాగస్వామ్యమవుతుంది తప్ప అది స్వతంత్ర హక్కుల ఉద్యమం కాదు అనే అవగాహనని ఆయన అవిష్కరింపజేశారు.
తాత్విక పునాదికోసం దిశా నిర్దేశం
’హక్కుల ఉద్యమానికి ఒక తాత్విక పునాది ఉండాలి’ అని బాలగోపాల్ ఆకాంక్షించారు. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, నిర్మాణాలు, తాత్విక దృక్పథాలు మొదలైన వాటికి పరిమితమై ఉండే ధోరణి నుంచి కాకుండా హక్కుల ఉద్యమానికి ఉండవలసిన పరిధి, పరిమితులను నిర్వచించి వాటికి అనుగుణంగా కార్యాచరణ ఎలా ఉండాలనే దానినీ ఆలోచనాత్మకంగా దిశానిర్దేశనం చేశారు.
‘విశాలమైన ప్రజాస్వామ్య ఉద్యమాలు అన్నింటికీ ఉపయోగపడేలా హక్కుల సంఘం ఉండాలని, ఆ రకంగానే హక్కుల కార్యక్షేత్రం రూపొందితమై తద్వారా కార్యకర్తలు ఉద్యమించాలని బాలగోపాల్ మార్గ నిర్దేశనం చేశారు.
‘పౌరహక్కుల సంఘం’ కార్యదర్శిగా పనిచేసినంత కాలం ఆయన ఒక అభిప్రాయాన్నిగాని, నిర్ణయాన్నిగాని సంఘం మీద బలవంతంగా రుద్దాలనే ప్రయత్నాన్ని ఎన్నడూ చేయలేదు. మొత్తం సంఘంలోని అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయాన్ని ప్రకటించే వారు. ప్రజాస్వామ్యబద్ధంగా బహిర్గతమైన నిర్ణయాన్ని ఆయన తక్షణమే ఆచరణలోకి తెచ్చేవారు.
రూపం ఏదైనా హింసకు వ్యతిరేకం
‘పౌర హక్కుల సంఘం’ అంగీకరించిన తర్వాతే బాలగోపాల్ కార్యక్రమాలను నిర్వహించేవారు. ఆయన మొత్తం ఉద్యమంలో భాగంగా ఆలోచనలు చేయడం, ఆలోచనలో భాగంగా చర్చ చేయడం జరిగింది. అంతిమంగా ఆయన ఆలోచనలన్నీ వ్యక్తిగతంగా సాధ్యం కాలేదు.
సంఘం పేర్కొన్న మేరకు ఆచరణలో ముందుకు సాగాయి. ఆయన ఆలోచనలు కొన్నింటిని సంఘం వ్యతిరేకించింది. అందువల్లనే ఆయన పౌర హక్కుల సంఘం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఎన్‌కౌంటర్‌లు, అక్రమ అరెస్టులు, చిత్రహింసలు, లాకప్ మరణాలు మొదలైన వాటికి వ్యతిరేకంగా బాలగోపాల్ ఉద్యమించి ప్రజలలో గొప్ప చైతన్యాన్ని తెచ్చారు.
ఉద్యమానికి ఒక సైద్ధాంతిక రూపం
పౌర హక్కుల ఉద్యమం స్వతంత్రంగా ఉండాలని, ఉద్యమం ఎవరినైనా ప్రశ్నించగలగాలని బాలగోపాల్ పౌర హక్కుల ఉద్యమానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించి, తలమానికంగా నిలిచారు. హక్కుల ఉద్యమం స్వతంత్రంగా తన చుట్టూ ఉన్నన్ని ఉద్యమాలలో నైతిక విలువల సార్వజనీతను ముందుకు తీసుకుపోతూ, వాటి వ్యవస్థీకరణ కోసం ప్రయత్నాలు, ప్రయోగాలు చేయాలని బాలగోపాల్ ప్రతిపాదించారు.
విలువలు, ప్రమాణాలు ఉద్యమాలకు లేని పరిస్థితుల్లో కార్యకర్తలు అరాచకంగా ప్రవర్తిస్తే దానికి అడ్డుకట్ట వేయడం సమస్యగా ఉత్పన్నం కావచ్చు. అందువల్ల విలువలు, ప్రమాణాలు కార్యకర్తల ప్రమాణాలను మరింత బాధ్యత వహించే విధంగా మారుస్తాయని బాలగోపాల్ బలంగా విశ్వసించి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు.
‘సామాజిక మార్పులో నక్సలైట్ ఉద్యమాలతోపాటు ఇతర ఉద్యమాలు కూడా భాగమైనప్పుడు పౌర హక్కుల సంఘాల కేవలం నక్సలైట్ ఉద్యమాలతో మాత్రమే సరిపుచ్చుకోకుండా ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని రకాల ఉద్యమాల గురించీ పట్టించుకోవాలి’ అనే దానికి బాలగోపాల్ సైద్ధాంతిక రూపాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు.
ఆ రకంగా సిద్ధాంతీకరణ ప్రక్రియ ప్రారంభం కాగానే, అప్పుడు పౌర హక్కుల సంఘంలో ‘రాజ్యహింసని మాత్రమే ప్రశ్నించాలి’ అని, అలాగే ‘అన్ని రకాల ఆధిపత్య హింసలను కూడా ప్రశ్నించాలి’ అనే రెండు రకాల ధోరణులు పొడచూపాయి. ‘నక్సలైట్ ఉద్యమానికి అతీతంగా పౌర హక్కుల ఉద్యమానికి ఒక కార్యాచరణ, ఓ కార్యక్షేత్రం ఉండాలి’ అనే విషయంలో బాలగోపాల్ చాలా కన్విన్స్ అయ్యారు.
ఆ దిశగా ఆయన పౌర హక్కుల సంఘాన్ని మలిచే ప్రయత్నమూ చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా పౌర హక్కుల సంఘంలో ఆ అంతర్గత ఆలోచనని మౌలికంగా మార్చలేమనే ఆలోచనకి ఎప్పుడైతే చేరువయ్యారో అప్పుడు ఆయన సంఘం నుంచి బయటకు వెళ్లిపోయారు.
బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో గుణాత్మక మార్పులు తెచ్చి హక్కుల ఉద్యమంలో నూతన ఒరవడులతో ఉద్యమించారు. కాని, పరిణామ క్రమంలో తానై తీర్చిదిద్దిన పౌర హక్కుల సంఘం నుంచి ఆయన వైదొలిగి 1998 అక్టోబర్ 11న ‘మానవ హక్కుల వేదిక’ను స్థాపించారు.
పౌర హక్కుల ఉద్యమంలో బాలగోపాల్ నూతన ఒరవడితో తనదైన ప్రజాస్వామిక కార్యచరణతో నిరుపమాన కృషి చేశారు. 1952 జూన్ 10న జన్మించిన బాలగోపాల్ ప్రజా హృదయాలలో చెరగని ముద్ర వేసి, 2009 అక్టోబర్ 8న మరణించారు. చరిత్రలో ‘చెరగని హక్కుల స్ఫూర్తి’గా ఆయన ఎప్పటికీ వెలుగొందుతుంటారు.
జె.జె.సి.పి. బాబూరావు
వ్యాసకర్త సెల్: 9493319690