calender_icon.png 22 October, 2024 | 7:16 AM

ఓటమి కోరల్లోనే

19-10-2024 12:00:00 AM

  1. రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకున్న భారత్
  2. కోహ్లీ, సర్ఫరాజ్, రోహిత్ అర్థ శతకాలు
  3. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 402 ఆలౌట్ 
  4. రచిన్ రవీంద్ర శతకం

* బెంగళూరు టెస్టులో టీమిండియా పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలదొక్కుకుంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో 

నాలుగో రోజు ఆట రోహిత్ సేనకు కీలకం కానుంది. దీంతో తొలి టెస్టులో భారత్ ఇంకా ఓటమి కోరల్లోనే ఉంది..!

బెంగళూరు: సొంతగడ్డపై న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఇంకా ఓటమి కోరల్లోనే ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకున్నప్పటికీ టీమిండియా మరో 125 పరుగులు వెనుకబడే ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో టీమిండియా ఏం చేస్తుందన్నది ఆసక్తికరం.

ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (70 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. కోహ్లీ (70), రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టాడు.

అంతకముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (134) శతకంతో మెరవగా.. టిమ్ సౌథీ (63) అర్థశతకం సాధించా డు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. 

నిలబెట్టిన కోహ్లీ, సర్ఫరాజ్

180/3 క్రితం రోజు స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ మరో 53 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రచిన్ రవీంద్రకు జత కలిసిన సౌథీ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో రచిన్ రవీంద్ర టెస్టుల్లో రెండో సెంచరీ సాధించగా.. సౌథీ టెస్టుల్లో ఏడో అర్థసెంచరీ అందుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు సౌథీతో కలిసి 134 పరుగులు జోడించడం విశేషం.

చివరకు సౌథీని సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో భారత్‌కు బ్రేక్ లభించింది. ఇక ఇన్నింగ్స్ చివరి వికెట్‌గా రచిన్ వెనుదిరగడంతో న్యూజిలాండ్ 356 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు జైస్వాల్, రోహిత్ శుభారంభం ఇచ్చారు. జైస్వాల్ (35) ఔట్ కాగా.. అర్థసెంచరీ సాధించిన కాసేపటికే రోహిత్ దురదృష్టవశాత్తూ ఎజాజ్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

అనంతరం కోహ్లీ, సర్ఫరాజ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. టీ విరామం అనంతరం ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ నిలదొక్కుకున్నట్లే కనిపించింది. ఆట ముగుస్తుందనగా గ్లెన్ పిలిప్స్ బౌలింగ్‌లో కోహ్లీ టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 231 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 

కోహ్లీ @ 9వేలు

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో 9వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. భారత రెండో ఇన్నింగ్స్ సందర్భంగా 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. విరాట్ కంటే ముందు సచిన్ (15, 921), ద్రవిడ్ (13, 265), గావస్కర్ (10, 122) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 18వ ప్లేయర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు.