calender_icon.png 19 February, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఫాల్ట్ డబ్బు మార్చి 31లోగా చెల్లించాలి

14-02-2025 12:00:00 AM

జగిత్యాల, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు డిఫాల్ట్ డబ్బులు మార్చి 31లోగా చెల్లించాలని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్.లత సూచించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సివిల్ సప్లు టాస్క్ ఫోర్స్ అధికారులు, డిఫాల్ట్ అయిన మిల్లర్లతో జగిత్యాల జిల్లా అదనపు  కలెక్టర్ రెవెన్యూ బిఎస్.లత సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ దించుకున్న ధాన్యానికి 10% బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. డిఫాల్ట్ మిల్లర్లు విధిగా సదరు డబ్బులను మార్చి 31 లోగా చెల్లించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. ఈ నిబంధనను మిల్లర్లు ఖచ్చితంగా పాటించాల్సిందేనని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని సూచించారు. 2019 - 2020 నుండి 2023 - 2024 సంవత్సరంలో డిఫాల్ట్ అయిన మిల్లర్లు 25 శాతంతో కలిపి మార్చి 31  తేదీలోగా డిఫాల్ట్ డబ్బులను ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు.

డబ్బులు చెల్లించే విషయంలో మిల్లర్లు నిర్లక్ష్యం వహించరాదని,  వెంటనే ఆ డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్, 2024 - 25 సంవత్సరం దించుకున్న ధాన్యానికి సంబంధించి 10 శాతం   బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలని సూచించారు.

డిఫాల్ట్ అయిన మిల్లర్లకు ఇదే చివరి అవకాశమని,  స్టేట్ పుల్ బియ్యం పెట్టుకునేందుకు చివరి అవకాశం ప్రభుత్వం ఇచ్చిందని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మిల్లర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను ఎప్పటికప్పుడు పాటించాలని, నిబంధన పాటించనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మిల్లర్లు వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మేనేజర్, డిఎస్‌ఓ, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు.