calender_icon.png 4 October, 2024 | 4:56 AM

మంత్రి సురేఖపై పరువునష్టం దావా

04-10-2024 02:54:53 AM

క్రిమినల్ చర్యలు తీసుకోండి

నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున పిటిషన్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున గురువారం నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా (సెక్షన్ సెక్షన్ 223 బీఎన్‌ఎస్‌ఎస్) వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఆ దావాలో నాగార్జున పేర్కొన్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా తమ కుటుంబం పరువుకు సంబంధించిన అంశాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో నాగార్జున కోరారు. సినీ పరిశ్రమలో తమ కుటుంబానికి ఉన్నతమైన స్థానం ఉందని, నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు.

అయితే పరువునష్టం కింద సురేఖ నుంచి నాగార్జున డబ్బులు ఆశించలేదు. నాగార్జున దాఖలు చేసిన వ్యాజ్యంపై నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. అలాగే సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున సతీమణి అక్కినేని అమల సైతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కోరారు. తమ కుటుంబంపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని, రాజకీయ వివాదాల్లోకి తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు.