- ఏఈ సాంకేతికత ద్వారా ప్రొఫైల్ చెకింగ్
- అర్హత, నైపుణ్యాలున్న వారికి కొలువుల కల్పన
- గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్ డౌన్‌లోడ్‌కు అవకాశం
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని పరిశ్రమలశాఖ ద్వారా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్)ను అందుబాటులోకి తీసుకొచ్చి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
డీట్ ఇక నుంచి ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలను సమన్వయం చేసే వ్యవస్థగా పనిచేయనున్నది. కంపెనీలు, నిరుద్యోగుల కు మధ్య వారధిగా అనుసంధానకర్తగా వ్యవహరించనున్నది. ఏఐ సాంకేతికతతో ఉద్యో గార్థుల ప్రొఫైల్స్, నైపుణ్యాలను గుర్తించి, వారికి అనువైన ఉద్యోగ అవకాశాలను గుర్తించనున్నది.
అలా ఉద్యోగార్థులకు మా న్యుఫాక్చరింగ్, ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్‌తో పాటు ఇతర కంపెనీల్లో ఉద్యోగావకాశాలు, అప్రెంటీస్‌షిప్, ఇంటర్న్‌షిప్‌కు బాటలు వేయనున్నది. అలాగే ఉన్నత విద్య చదువుతూ ఫైనల్ ఇయర్‌కు చేరిన విద్యార్థుల వివరాలనూ సమగ్రంగా నమోదు చేయనున్నది.
ఇలా చేయడం ద్వారా కోర్సు పూర్తి చేయగానే విద్యార్థులు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. డీట్ ఇక నుంచి ఎప్పటికప్పుడు ఉద్యోగార్థుల మొబైల్ లేదా ‘ఈ మెయిల్’ అడ్రెస్‌కు జాబ్ మేళాలు, ఇంటర్వ్యూలపై సందేశాలు పంపించనున్నది.
ఉద్యోగార్థుల నివాస ప్రాంతాల ఆధారంగా ఉద్యోగావకాశాల వివరాలు వారికి చేరతాయి. ఇప్పటికే పెద్దపల్లిలో ఈ నెల 4న సీఎం రేవంత్‌రెడ్డి డీట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. డీట్ ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ప్రైవేట్ సంస్థల్లో కొలువులు వచ్చాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘డీట్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐటీశాఖ సూచిస్తున్నది.