- చెట్లకు వేలాడదీసి మాసం కుప్పలు విక్రయం
- వరుస ఘటనలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు
- అంతరించిపోతున్న అటవీ జంతువులు
కోనరావుపేట, జనవరి 6: వన్యప్రాణులు, అటవీ జంతువులు వేటగాళ్ల చేతి లో బలవుతున్నాయి. వేటగాళ్లు వెంటాడి వాటిని వధిస్తున్నారు. వెంటనే అటవీ లోనే చెట్లకు వేలాడిదీసి మాంసాన్ని గ్రామాలకు తరలించి వాటిని విక్రయిస్తు న్నారు. ఇదంతా వారికి రోజువారిలో భాగం కాగా అటవీశాఖ అధికారులు మాత్రం మాకెందు కులే అన్నట్లు వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
దీంతో వేటగాళ్లు చేస్తున్న పనులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మమ్మల్ని ఏం చేస్తారులే అనుకుంటూ జంతువులను నిత్యం బలితీసుకుంటూ వారి పని వారు కొనసాగిస్తున్నారు. కాగా సోమవారం కోనరావుపేట మండలంలోని శివంగాళపల్లి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు దుప్పిని వధించారు. అక్కడే ఉన్న చెట్టుకు తలక్రిందులుగా దుప్పిని వేలాడిదీసి మాంసంను తీశారు.
మిగిలిన తలభాగం, చర్మం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కుక్కలు, ఇతర జంతువులు గ్రామాలకు తీసుకురాకుండా తెలివిగా చెట్లపైనే చర్మం, తలభాగం వదిలేశారు. మాంసాన్ని మాత్రం కుప్పలు, కుప్పలుగా తీసుకువెళ్లి పట్టణాలల్లో, గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ పైసలు దండుకున్నారు. ఇలా వేటగాళ్లకు అటవీప్రాంతాలలో రోజురోజుకు వన్యప్రాణులు కనుమరుగువుతున్నాయి.
ఇటీవల కూడా మర్తనపేట గ్రామశివారులో ఇదే తంతు జరుగగా, అధికారులు కనీసం వారిని గుర్తించి చర్యలు తీసుకోలేదు. దీంతో వేటగాళ్లు ఎవ్వరు పట్టించుకోరులేని భయమే లేకుండా వెంటాడుతున్నారు. ఇప్పటికైన అటవీశాఖ అధికారులు, పోలీసులు వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని గ్రామస్తులు, జంతుప్రేమికులు కోరుతున్నారు.