కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): పురపాలక సంఘాల పాలకవర్గం పదవీకాలం ఈ నెల 26వ తేదీతో ముగిసినందున జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపల్ ప్రత్యేక అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మాట్లాడుతూ... మున్సిపాలిటీల పాలకవర్గ పదవీకాలం ముగిసినందున ప్రత్యేక అధికారులను నియమించడం జరుగుతుందని, ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పట్టణ అభివృద్ధికి, మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిష్కరించే దిశగా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.