calender_icon.png 20 September, 2024 | 9:45 AM

మల్లారెడ్డి, నీలిమా కాలేజీల డీమ్డ్ హోదా రద్దు చేయాలి

19-09-2024 12:57:48 AM

టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హరీశ్‌గౌడ్

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మల్లారెడ్డి, నీలిమా సహా మిగతా మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల డీమ్డ్ హోదాను యూజీసీ రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి సమాఖ్య (టీవీఎస్) బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. కాళోజీ యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా యూజీసీ వీటికి ప్రత్యేక కేటగిరి కింద డీమ్డ్ యూనివర్సిటీ హోదాను ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల మెరిట్ విద్యార్థులు నష్టపోతారని టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హరీశ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

కన్వీనర్ కోటాలో రూ.60 వేలు ఉండాల్సిన ఫీజు రూ. 18 లక్షలకు చేరుతుందని, స్థానిక కోటా అనేది లేకుండా పోతుందన్నారు. మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లను స్థానికులకే ఇవ్వాల్సి ఉండగా.. ఏ ప్రాంత విద్యార్థినైనా తీసుకునేలా మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి యూజీసీ వెసులుబాటు కల్పించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ విషయమై దృష్టిసారించాలన్నారు.