calender_icon.png 23 September, 2024 | 4:53 AM

డ్రీమ్స్‌కు డీమ్డ్ దెబ్బ

23-09-2024 02:40:50 AM

డీమ్డ్ పేరిట పేద, మెరిట్ విద్యార్థులకు అన్యాయం

వైద్య విద్యలో కోట్లు కొల్లగొట్టే కుట్రలకు శ్రీకారం

డీమ్డ్ అంటేనే అత్యధిక ఫీజులు, పర్యవేక్షణ లోపం

రిజర్వేషన్లు, స్థానిక కోటా సీట్లకు భారీ గండి

కన్వీనర్ కోటాకు గండిపై సర్కారు సీరియస్

డీమ్డ్ వల్ల నష్టపోతామంటున్న విద్యార్థులు

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): దేశంలో ఏ కోర్సుకైనా డిమాండ్ విషయంలో ఎత్తుపల్లాలు ఉండవచ్చేమోకానీ వైద్య విద్యకు ఎప్పటికీ వన్నె తర గదు. వైద్య విద్య అభ్యసించాలనుకునే వారికి దేశంలో తగినన్ని సీట్లు లేక, ఇక్కడ చదివే అవకాశం రాక చాలా మంది విదేశాల్లో ఎంబీబీఎస్ చేస్తున్నారు. తెలంగా ణలో ఎక్కువ మంది విద్యార్థులకు వైద విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ సీట్లను భారీగా పెంచింది.

అయినా కూడా వైద్య విద్య కోసం ఆసక్తి చూపిస్తున్న విద్యార్థుల సంఖ్యకు అందుబా టులో సీట్ల సంఖ్యకు ఎంతో తేడా ఉంటోంది. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని రెండు ప్రైవేటు మెడికల్ కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీ పేరిట అనుమతులు పొంది కన్వీనర్ కోటాతో సంబంధం లేకుండా సొంతంగా సీట్లు అమ్ముకునేందుకు అనుమతులు పొందాయి. దీనిపై తెలంగాణ విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. డీమ్డ్ యూనివర్సిటీల పేరిట ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు గండి కొట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి రాష్ర్ట ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుబంధం గా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కన్వీనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకు రావాలని యోచిస్తోంది. ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు, డీమ్డ్ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీ లు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తోంది. 

డీమ్డ్ యూనివర్సిటీలపై నివేదిక కోరిన మంత్రి

డీమ్డ్ యూనివర్సిటీల వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులను ఇదివరకే ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ ఆదేశించారు. రాష్ట్రంలోని మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు ఇటీవలే యూ జీసీ డీమ్డ్ యూనివర్సిటీగా అనుమతులు ఇచ్చింది. దీనివల్ల కన్వీనర్ కోటాలోకి రావాల్సిన 200 ఎంబీబీఎస్ సీట్లు, 100 బీడీఎస్ సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలోకి మారిపోయాయి. అపోలో, సీఎంఆర్ సహా మరో 4 ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం యూజీసీ వద్ద ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ కాలేజీలకు కూడా యూజీసీ నుంచి అనుమతులు వస్తే మరో 450 కన్వీనర్ కోటా సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలోకి వెళ్లిపోతాయి.

దీంతో నీట్‌లో మంచి మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయంపై ఇప్పటికే విద్యార్థి సంఘాలు, మెడికల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్లు యూజీసీకి నిరసన తెలియజేశా యి. మల్లారెడ్డి కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్ రద్దు చేయాలని మెడికల్ స్టూడెంట్స్, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతి పత్రం కూడా అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని, డీమ్డ్ వర్సిటీలను అడ్డుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టుగా విద్యార్థుల చెప్తున్నారు.

ఈ అంశంపై కాళోజీ యూనివర్సిటీ అధికారులతోనూ మంత్రి సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. యూజీసీ తీరు బడుగు, బలహీన వర్గాలకు చెందిన మెరిట్ విద్యార్థులకు తీరని అన్యాయం చేసేవిధంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించినట్టు అధికారులు చెప్తున్నారు. డీమ్డ్‌పై దెబ్బ కొట్టాలంటే ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్ రద్దు చేస్తే, ఆయా హాస్పిటళ్లకు వెళ్లే పేషెంట్ల సంఖ్య ఘననీయంగా తగ్గిపోతుంది. టీచింగ్ హాస్పిటళ్లకు సరిపడా పేషెంట్లు రాకపోతే, ఆయా కాలేజీల పర్మిషన్లను నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు చేసే అవకాశం ఉంటుం ది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ రద్దు చేయాలని పేరెంట్స్, విద్యార్థి సంఘా లు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం సైతం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

కోట్లలో లాభం.

డీమ్డ్ యూనివర్సిటీ హోదా తెచ్చుకుంటున్న మెడికల్ కాలేజీలకు వందల కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీటు ఫీజు రూ.60 వేలు మాత్రమే ఉంటే, మేనేజ్‌మెంట్ కోటా ఫీజు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. మరికొన్ని చోట్ల ఇంకా ఎక్కువ మొత్తంలోనూ వసూలు చేస్తున్నారు. ఆయా కాలేజీల్లో ఉన్న వసతులను బట్టి ఈ ఫీజులను రాష్ర్ట ప్రభుత్వం నియమించిన ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్ణయిస్తోంది. డీమ్డ్ యూనివర్సిటీలు ఫీజు రెగ్యులేటరీ కమిటీతో సంబంధం లేకుండా, సొంతగానే ఫీజులను నిర్ణయించుకునే అధికారాన్ని యూజీసీ కల్పిస్తోంది.

మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజు రూ.17.5 లక్షలుగా పెట్టుకున్నట్టుగా కాళోజీ అధికారులు చెప్తున్నారు. గతంలో కన్వీనర్ కోటా ఫీజు 200 సీట్లకు ఏడాదికి రూ.1.2 కోట్లు వస్తే, ఇప్పుడు అదే 200 సీట్లకు ఏడాదికి రూ.35 కోట్ల ఆదాయం వస్తుంది. ఒక బ్యాచ్ స్టూడెంట్ల మీద ఏకంగా రూ.175 కోట్లు సమకూరుతుంది. కాలేజీ మీద రాష్ర్ట ప్రభుత్వ మానిటరింగ్ ఏమాత్రం ఉండదు. సొంతగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మూల్యాంకనం వంటి మినహాయింపులు ఉండడం వల్ల, ఇక్కడ చదివే విద్యార్థులు సులభంగా మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీంతో ఎంత ఫీజైనా చెల్లించి ఇలాంటి కాలేజీల్లో చేరేందుకు ధనికుల పిల్లలు ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలోనే అపోలో, కామినేని, ఆర్వీఎం వంటి పలు కాలేజీలు డీమ్డ్ హోదా కోసం యూజీసీ వద్ద ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఎన్‌వోసీ లేకుండానే పర్మిషన్

మెడికల్ కాలేజీలకు యూజీసీకి అస లు సంబంధం ఉండదని, కాలేజీల అనుమతులు, పర్యవేక్షణ వ్యవహారాలన్నీ నేషనల్ మెడికల్ కమిషనే చూస్తుందని మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా మెడికల్ కాలేజీ డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆ కాలేజీ అప్పటికే అఫిలియేట్ అయి ఉన్న యూనివర్సిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా పొంది ఉండాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి.

మల్లారెడ్డి కాలేజీలకు అసలు తాము ఎన్‌వోసీ ఇవ్వనే లేదని, ఎన్‌వో సీ లేకుండానే డీమ్డ్ హోదా తెచ్చుకున్నారని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. అలాగే, ఫీజుల విషయంలో ఎన్‌ఎంసీ నుంచి స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నాయని, 50 శాతం సీట్లకు రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. 

కానీ, ఈ నిబంధనలేవీ మల్లారెడ్డి కాలేజీ పాటించటం లేదని ఆరోపిస్తున్నా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, విద్యార్థులు ఎవరైనా ఈ విషయంలో కోర్టుకు వెళ్తే మల్లారెడ్డి కాలేజీల్లో అడ్మిషన్లు ఆగిపోతాయని అధికారులు చెప్తున్నారు.

నష్టపోతున్న మెరిట్ స్టూడెంట్స్

రాష్ర్ట ప్రభుత్వం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీతో సంబంధం లేకుండా మల్లారెడ్డి కాలేజీలకు ప్రత్యేక (డిస్టింక్ట్) క్యాటగిరీ కిం ద డీమ్డ్ హోదా ఇస్తూ యూజీసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఆయా కాలేజీల్లో కన్వీనర్ కోటా, రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేకుండా అనుమతులు జారీ చేసింది. ఫీజుల ఖరారు, పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల మూల్యాంకనం వం టివన్నీ యూనివర్సిటీ హోదాలో సొంతగానే చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది.

తెలంగాణ లోకల్ కోటా అమలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు ఇచ్చింది. దీంతో మల్లారెడ్డి కాలేజీల్లో ఉన్న 400 ఎంబీబీఎస్ సీట్లు, సుమారు 200 బీడీఎస్ (డెంటల్) సీట్లు పూర్తిగా మేనేజ్‌మెంట్ కోటాలోకి వెళ్లిపోయాయి. గత ఏడాది వరకూ ఇందులో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు. నీట్‌లో మంచి ర్యాంక్ సాధించిన మెరిట్ స్టూడెంట్స్‌కు ఈ సీట్లు దక్కేవి. మెరిట్ ర్యాంకు సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ చదివే అవకాశం దక్కేది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లలోనూ 85 శాతం తెలంగాణ విద్యార్థులకే కేటాయించేవారు. 

కానీ, ఇకపై ఈ నిబంధనలేవీ అమలు చేయాల్సిన అవసరం లేకుండా యూజీసీ మల్లారెడ్డికి మినహాయింపులు ఇచ్చింది. ఇదే బాటలో ఇతర కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రాష్ర్టంలో కన్వీనర్ కోటా, రిజర్వేషన్ కోటా సీట్లు తగ్గిపోయి మెరిట్, పేద విద్యార్థులకు అన్యాయం జరి గే ప్రమాదం ఉంటుందని విద్యార్థి సంఘా లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

నాణ్యత తగ్గిపోతుంది..

వైద్య విద్యలో డీమ్డ్ యూనివర్సిటీలు ఉండటం వల్ల నాణ్యమైన వైద్య విద్యకు అవకాశాలు తగ్గుతున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలు అధిక ఫీజులు వసూలు చేస్తాయి. ఇది సామాన్య, పేద కుటుంబాలకు అందుబాటులో ఉండ దు. మెరిట్ విద్యార్థులకు డీమ్డ్ యూనివర్సిటీల్లో అవకాశమే లేకుండా పోతుం ది. ఫలితంగా రాష్ట్ర విద్యార్థులకు ఈ డీమ్డ్ ప్రయోజనాలేవీ లేకుండా పోతా యి. మరోవైపు డీమ్డ్ యూనివర్సిటీలు స్వతంత్రంగా పని చేస్తుంటాయి. ప్రభు త్వ నియంత్రణకు అవకాశమే లేకుండా పోతుంది. ఇది నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడానికి దారితీస్తుంది. డబ్బున్న బడాబాబులు ఇక్కడ ఎంత ఫీజైనా చెల్లించి చేరి ఎంబీబీఎస్ డిగ్రీతో బయటకు వస్తే వారి పైపై చదువుల వల్ల రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టమని పలువురు నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం ఈ అం శంపై సీరియస్‌గా దృష్టి సారించాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు. 

మల్లారెడ్డి, నీలిమ కాలేజీల డీమ్డ్ హోదా రద్దు చేయాలి

రాష్ర్టంలోని మల్లారెడ్డి, నీలిమ సహా మిగతా మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల డీమ్డ్ హోదాను యూజీసీ రద్దు చేయాలి. కాళోజీ యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రత్యేక క్యాటగిరీ కింద డీమ్డ్ యూనివర్సిటీ హోదాను యూజీసీ ఇవ్వడం వల్ల రాష్ర్టంలోని పేద, బడుగు బలహీన వర్గాలతోపాటు మెరిట్ వైద్య విద్యార్థులు నష్ట పోతారు. రూ.60 వేలు ఉండాల్సిన కన్వీనర్ ఫీజు రూ.18 లక్షలకు చేరుతుంది. స్థానిక కోటా అనేది లేకుండా పోతుంది. మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లు స్థానికులకు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పుడు మొత్తం ఎవరికైనా అమ్ముకునేలా పరిస్థితి మారిపో తుంది.

వైద్య విద్యలో యూజీసీ జోక్యం వల్ల దేశంలో మెరుగైన వైద్య విద్యకు అవకాశం లేకుండా పోతుంది. డీమ్డ్ యూని వర్సిటీల వల్ల మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కేఎన్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి డీమ్డ్ హోదాను రద్దు చేయాలి. యూజీసీ ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి. రద్దు చేయకపోతే ఢిల్లీలోని యూజీసీ కార్యాలయం ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగుతాం.

 హరీశ్‌గౌడ్,

టీవీఎస్ రాష్ర్ట అధ్యక్షుడు