calender_icon.png 22 September, 2024 | 6:56 PM

దేహమూ ప్రజాసేవకే అంకితం

13-09-2024 01:41:58 AM

  1. వైద్య పరిశోధనల కోసం ఏచూరి పార్థివదేహాన్ని ఆసుపత్రికి దానం 
  2. ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించనున్న కుటుంబీకులు 
  3. వామపక్ష నేతల ఒరవడిని కొనసాగించిన సీతారాం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి దేశ రాజకీయాలకు తీరని లోటుగా చెప్పవచ్చు. విద్యార్థి దశ నుంచే లెఫ్ట్ భావాలు ఔపోసన పట్టి ప్రజల కోసం పోరాడిన ఏచూరి.. తుదిశ్వాస విడిచిన తర్వాత తన దేహాన్ని కూడా ప్రజాసేవకే అంకితమిచ్చారు. మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధన కోసం దానం చేస్తున్నట్లు ఏచూరి కుటుంబీకులు గురువారం ప్రకటించారు. వామపక్ష నేతలు తమ పార్థివదేహాలను పరిశోధనల కోసం ఇచ్చే సంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. 

a2024 ఆగస్టులో మరణించిన పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, సీపీఎం అగ్రనేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) కూడా వైద్య పరిశోధనల కోసం తన పార్థివదేహాన్ని దానం చేశారు. కోల్‌కతాలోని నీల్త్రన్ సిర్కార్ ఆసుపత్రిలో అనాటమీ విభాగానికి అప్పగించారు. ఇందుకు సంబంధించి 2006 మార్చిలో బుద్ధదేవ్ ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు. 

aబెంగాల్‌కు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతి బసు కూడా మరణానంతరం తన శరీరాన్ని వైద్య పరిశోధనలకు అప్పగించారు. 2010లో బసు మరణించగా కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి దానం చేశారు. 

aలెఫ్ట్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ కూడా తన శరీరాన్ని దానం చేస్తానని 2000లో హామీ ఇచ్చి 2018లో మరణించిన తర్వాత ఆయన కుటుంబీకులు ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. వీరితో పాటు సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్, పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌదరి పార్థివదేహాలు కూడా వైద్య పరిశోధనల కోసం ఆసుపత్రులకు అప్పగించారు. 

రేపు పార్టీ కార్యాలయంలో ఏచూరి భౌతికకాయం

సీతారం ఏచూరి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించిన సీపీఎం.. ఆయన పార్థివదేహాన్ని సెప్టెంబర్ 14న ఢిల్లీలోని తమ పార్టీ కేంద్ర  కార్యాలయం ఏకే గోపాలన్ భవన్‌కు తరలించనున్నట్లు వెల్లడించింది. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. ఏచూరి కోరిక మేరకు ఆయన పార్థివదేహాన్ని వైద్య పరిశోధన కోసం ఢిల్లీ ఎయిమ్స్ అప్పగించనున్నట్లు పేర్కొంది.