calender_icon.png 6 November, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెడికేషన్ కమిషన్

04-11-2024 02:50:21 AM

  1. హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు 
  2. నేడు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
  3. 6 నుంచి కులగణన ప్రారంభానికి ఏర్పాట్లు 
  4. బీసీ కులగణనపై చిత్తశుద్ధితో ఉన్నామని స్పష్టీకరణ 

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): కుల గణనపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. హైకోర్టు తీర్పు మేరకు సోమవారంలోగా డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

వెనుకబడిన తరగతుల కుల గణనకు ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ వేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు పలువురు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.

కోర్టు తీర్పుపై ఏంచేయాలో సుదీర్ఘంగా చర్చించారు. అనం తరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కుల సర్వే ప్రారంభమవుతుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా పాటించాలని సీఎం అభిప్రాయపడ్డారు. అందరితో చర్చించిన అనంతరం..

అందరి అభిప్రాయాల మేరకు డెడికేషన్ కమిషన్‌కు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని, అందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

బీసీ కమిషన్ బహిరంగ విచారణ వాయిదా

  1. డెడికేషన్ కమిటీ ఏర్పాటుతో నిర్ణయం
  2. త్వరలో సవరించిన షెడ్యూల్ ప్రకటన

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో చేపట్టబోయే సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా బీసీ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ విచారణను వాయిదా వేస్తున్నట్టు బీసీ కమిషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే పలు జిల్లాల్లో బహిరంగ విచారణ పూర్తయింది. ఇంకా మిగిలి ఉన్న ఉమ్మడి జిల్లాలు నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన బహిరంగ విచారణను వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నది.

రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం తీర్పు నేపథ్యంలో  కులగణనకు సంబంధించి ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ బహిరంగ విచారణను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. సవరించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బీసీ కమిషన్ పేర్కొన్నది.