- ప్రవాసులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి..
- ‘ప్రపంచ తెలుగు సమాఖ్య’ ముగింపు వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాం తి): దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రాభ ం తగ్గిందని, మళ్లీ పూర్వవైభవం రావాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని హైచ్‌ఐసీసీ లో ఆదివారం నిర్వహించిన ప్రపంచ తెలు గు సమాఖ్య 12వ మహసభ ముగింపు వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
దేశంలో హిందీ తర్వాత అత్యధికశాతం మంది మాట్లాడే భాష తెలుగు అని కొనియాడారు. తెలుగు గడ్డ నుంచి వెళ్లి నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, వెంకటస్వామి, జైపాల్‌రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి రాజకీయ ఉద్దండులు దేశ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారని కొనియాడారు.
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, తద్వారా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
‘తెలంగాణ రైజింగ్ నినాదంతో తమ ప్రభుత్వం మంచి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. తెలుగు భాషను గౌరవిస్తూ తమ ప్రభుత్వం తెలుగులో జీవోలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభకు తాను ముఖ్యఅతిథిగా హాజరుకావడం ఆనందాన్నిచ్చిందన్నారు.
అమెరికాలోనూ తెలుగు భాషదే పైచేయి..
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
అమెరికాలో ఎక్కువమంది మాటా డే భాషల్లో తెలుగు భాషదే పైచేయి అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. హైదరాబాద్‌లోని హైచ్‌ఐసీసీలో ఆదివారం నిర్వహించిన ప్రపం చ తెలుగు సమాఖ్య 12వ మహసభకు విచ్చేసి మాట్లాడారు. ప్రతి మనిషిలో విజ్ఞానం వికసించడానికి మాతృభాష ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు.
మానవాళి విజ్ఞానపథంలో ముందుకు తీసుకెళ్లే సాధం కేవలం భాష మాత్రమేనని స్పష్టం చేశారు. భాష, వేషంపై గౌరవం ఉన్నవారికే, ఇతరుల నుంచి గౌరవం లభిస్తుందన్నారు. ప్రాథమిక విద్య మాతృ భాషలో ఉండడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల రెండు ప్రభుత్వాలు పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగువారంతా ఇళ్లలో అమ్మభాషలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. దేశంలో విసృతంగా మాట్లాడే భాషల్లో తెలుగు నాలుగోస్థానంలో ఉందన్నారు. ప్రపంచంలో 15వ స్థానం లో ఉందని కొనియాడారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సమాఖ్య ఉపాధ్యక్షురాలు కవితా దత్, ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, హైదరాబాద్ చైర్‌పర్సన్ నార్నె విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి లక్ష్మి, కోశాధికారి వెంకట్, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.