calender_icon.png 23 October, 2024 | 9:53 PM

తగ్గుతున్న సాగు.. విస్తరిస్తున్న రియల్టీ

14-07-2024 12:05:00 AM

ఫాం ప్లాట్ల పేరుతో యథేచ్ఛగా విక్రయాలు

పదేండ్లలో 5 లక్షల ఎకరాల్లో లేఅవుట్లు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ.. రియల్టీ మాత్రం మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది. గతంలో ఇంటి నిర్మాణం కోసం మాత్రమే వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించేవారు. కానీ ప్రస్తుతం ఫాం ల్యాండ్స్ పేరుతో ఇష్టారీతిన వెంచర్లు చేసి విక్రయిస్తుండటంతో వ్యవసాయ విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతోంది. రెండు గుంటల నుంచి 10 గుంటల వరకు ఫాం ప్లాట్లుగా మార్చి ధరణిలో వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అనంతరం రైతుబంధు, రైతుబీమా వంటి సౌకర్యాలను కూడా పొందుతున్నారు. తక్కువ ధరలకే వస్తుండటంతో ప్రజలు కూడా ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గడిచిన పదేండ్లలో సుమారు 5 లక్షల ఎకరాల్లో ఫాం ప్లాట్లు విక్రయించారని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తామని ప్రకటించడంతో రియల్టర్లు ప్రధానంగా ఫాం ప్లాట్ల విక్రయంపై దృష్టి సారించారు. దీంతో ఈ దఫా ఎన్ని లక్షల ఎకరాలు వ్యవసాయానికి దూరమవుతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో నగర శివారులోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు హైదరాబాద్‌కు వచ్చేవి. కానీ రియల్ ఎస్టేట్ జోరు పెరగడం, ధరలు కోట్లకు పరుగెత్తడంతో చిన్న, సన్నకారు రైతులు కూడా భూమిని విక్రయించి రియల్టర్లుగా మారుతున్నారు.

కూరగాయలను పండించేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఇది ఇలాగే కొనసాగితే సాగు విస్తీర్ణం తగ్గి నగరాలకు సరఫరా అయ్యే కూరగాయల ధరలు రెండితలు పెరిగే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఫాం ప్లాట్లను నియంత్రించాల్సిన రెరా మాత్రం నిద్రవీడటం లేదు. దీంతో నగర శివారు ప్రాంతాలతోపాటు అనేక జిల్లా కేంద్రాల చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఫాం ప్లాట్లు ఇష్టారీతిన పుట్టుకొస్తున్నాయి.