calender_icon.png 7 October, 2024 | 1:45 PM

తగ్గిన మారుతి, హ్యుందాయ్ విక్రయాలు

02-09-2024 12:00:00 AM

టాటా మోటార్స్ 

అమ్మకాల్లోనూ క్షీణత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలైన మారుతి, హ్యుందాయ్, టాటా మోటార్స్  హోల్‌సేల్ అమ్మకాలు ఆగస్టు నెలలో క్షీణించాయి. డిమాండ్ తగ్గడంతో పాటు డీలర్ల వద్ద పేరుకున్న నిల్వల్ని క్లియర్ చేసేందుకు తాము డీలర్లకు పంపిణీచేసే వాహనాల్ని తగ్గించినట్టు ఆయా కంపెనీలు వెల్లడించాయి. పాసింజర్ వాహన మార్కెట్లో లీడర్ అయిన మారుతి సుజుకి హోల్‌సేల్ అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టు నెలలో 1,43,075 యూనిట్లు.

నిరుడు ఇదేనెలలో జరిగిన 1,56,114 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే ఈ ఆగస్టులో 8 శాతం తగ్గాయి. ఇదే బాటలో హ్యుందాయ్ డిస్పాచ్‌లు సైతం 8 శాతం క్షీణతతో 53,830 యూనిట్ల నుంచి 49,525 యూనిట్లకు చేరాయి. టాటా మోటార్స్ కార్ల అమ్మకాలు 3 శాతం తగ్గి 45,513 యూనిట్ల నుంచి 44,142 యూనిట్ల వద్ద నిలిచాయి. 

పెరిగిన కియా, టొయోటా, ఎంజీ కార్ల అమ్మకాలు

ఆగస్టు నెలలో కియా ఇండియా అమ్మకాలు మాత్రం 17 శాతం పెరిగి 19,219 యూనిట్ల నుంచి 22,523 యూనిట్లకు చేరాయి. టొయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 35 శాతం వృద్ధితో 30,879 యూనిట్లకు చేరాయి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా రిటైల్ అమ్మకాలు 9 శాతం వృద్ధితో 4,571 యూనిట్లకు పెరిగాయి. 

ఎస్‌యూవీలదే మెజారిటీ వాటా

ఆగస్టు నెలలో తమ డిస్పాచ్‌లను 13,000 యూనిట్ల మేర తగ్గించినట్టు మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. తమ చానల్ పార్టనర్ల వద్ద అధికంగా ఉన్న వాహన నిల్వల్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ ట్రెండ్‌ను బెనర్జీ వివరిస్తూ మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 55 శాతానికి చేరిందని తెలిపారు. మారుతి కార్లలో ఎస్‌యూవీల అమ్మకాల వాటా గత ఏడాదితో పోలిస్తే 25 శాతం నుంచి 29 శాతానికి చేరినట్టు వెల్లడించారు.

ఆల్టో, ఎస్‌ప్రెసో తదితర మినీ కార్ల అమ్మకాలు 12,209 యూనిట్ల నుంచి 10,648 యూనిట్లకు తగ్గాయి. బలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ తదితర కాంపాక్ట్ కార్ల డిస్పాచ్‌లు 20 శాతం తగ్గుదలతో 72,451 యూనిట్ల నుంచి రూ. 58,051 యూనిట్లకు దిగిపోయాయి. గ్రాండ్ వితారా, బ్రెజ్జా, ఎర్టిగా ఇన్విక్టో, ఎక్స్‌ఎల్‌ల6 అమ్మకాలు మాత్రం 58,746 యూనిట్ల నుంచి 62,686 యూనిట్లకు పెరిగినట్టు మారుతి ప్రకటన తెలిపింది.