నికర లాభం రూ.16,653 కోట్లుగా నమోదు
అదరగొట్టిన జియో
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 5 శాతం క్షీణించింది. ఆయిల్ రిఫైనింగ్, పెట్రో కెమికల్ వ్యాపారం ఆశించినమేర రాణించకపోవడం లాభంలో క్షీణతకు కారణం.
సమీక్షా త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.16,653 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.17,394 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.2.38 లక్షల కోట్ల నుంచి రూ.2.4 లక్షల కోట్లకు పెరిగినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
టెలికాం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్ ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 23.4 శాతం వృద్ధితో రూ.6539 కోట్లుగా నమోదైంది. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం నెలకు రూ.181.7 నుంచి రూ.195.1కి పెరిగింది. టారిఫ్‌ల సవరణ కలిసొచ్చింది. మొత్తం ఆదాయం రూ.37,119 కోట్లుగా నమోదైంది.
ప్రస్తుతం 14.8 కోట్ల మంది 5జీ సబ్‌స్ర్కైబర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది. ఇక రిలయన్స్ రిటైల్ వ్యాపార విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం రూ.2800 కోట్ల నుంచి1.3 శాతం వృద్ధితో రూ.2,836 కోట్లకు పెరిగింది.
కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 3.5 శాతం క్షీణించి రూ.66,502కోట్లుగా నమోదైంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు స్వల్పంగా లాభపడి రూ.2,745.50 వద్ద ముగిసింది.