బ్రోకరేజ్‌ల అంచనా
నేడు ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఆయిల్, టెలికాం, రిటైల్, న్యూ ఎనర్జీ వ్యాపారాల్లో విస్తరించిన ఉన్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) బలహీనమైన ఆర్థిక ఫలితాలు వెల్లడించవచ్చని మెజారిటీ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడా ది జూలై త్రైమాసికంలో ఆర్‌ఐఎల్ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 1 నుంచి 10 శాతం వరకూ తగ్గవచ్చ ని పేర్కొన్నాయి. ఆర్‌ఐఎల్ రిఫైనింగ్ ఉత్పత్తి స్వల్పంగా తగ్గవచ్చని, ఇందుకు తోడు ప్రభుత్వానికి అధిక పెట్రోలియం వాటాను చెల్లిం చాల్సి ఉన్నందున లాభాల మార్జిన్లు తగ్గవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనాల్లో పేర్కొంది.
క్యూ2 ఆర్థిక ఫలితాల్ని పరిగణనలోకి తీసుకునేందుకు ఆర్‌ఐఎల్ బోర్డు అక్టోబర్ 14 సోమవారం సమావేశమవుతుంది. మార్కెట్ వేళలు ముగిసిన తర్వాత ఫలితాల్ని వెల్లడిస్తుంది. ఆయిల్, పెట్రోకెమికల్స్ వ్యాపారం ఆర్‌ఐఎల్ ఇబిటాను క్షీణింపచేస్తుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పారిస్ పేర్కొంది. క్యూ1తో పోలిస్తే క్యూ2లో 4 శాతం వరకూ తగ్గవచ్చని అంచనా వేసింది.
క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇబిటా 3.1 శాతం మేర తగ్గవచ్చని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఆర్‌ఐఎల్ కన్సాలిడేటెడ్ ఇబిటా ఫ్లాట్‌గా రూ.39,700 కోట్లు ఉంటుందని, స్టాడెలోన్ ఇబిటా 26 శాతం క్షీణించి రూ.14,500 కోట్లకు పడిపోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వివరించింది.
టెలికాం ఇబిటాలో పెరుగుదల
రిలయన్స్ టెలికాం వ్యాపారం ఇబిటా జూలై త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 10.5 శాతం పెరగవచ్చని, ఏఆర్‌పీయూ (ఏవరేజ్ రెవిన్యూ పర్ యూజర్) లో ఆరు శాతం పెరుగుదల ఉంటుందని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ అంచనా వేసింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారం ఇబిటా 0.6 శాతం మాత్రమే వృద్ధిచెంది రూ.5,700 కోట్లకు చేరవచ్చని జేఎం ఫైనాన్షియల్ అంచనాల్లో పేర్కొంది.
బోనస్ షేర్ల జారీకి రికార్డు తేదీ ఖరారు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ నెలరోజుల క్రితం ఏజీఎంలో ప్రకటించిన బోనస్ ఇష్యూకు సోమవారం నాటి బోర్డు సమావేశంలో రికార్డు తేదీని ఖరారు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. షేర్‌హోల్డర్లకు ముందస్తు దీపావళి బహుమతిగా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంచనా ప్రకటించడం, ఆ తదుపరి బోనస్ షేర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపిన సంగతి విదితమే.
అయితే ఇప్పటివరకూ బోనస్ షేర్ల జారీకి షేర్‌హోల్డర్ల అర్హతను నిర్దేశించే రికార్డుతేదీని కంపెనీ వెల్లడించలేదు. ముందస్తు దీపావళి గిఫ్ట్‌గా ప్రకటించినందున, తాజా బోర్డు సమావేశంలో రికార్డు తేదీపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.