calender_icon.png 26 October, 2024 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఏలపై డిసిషన్ నేడు క్యాబినెట్‌లో!

26-10-2024 02:18:31 AM

  1. డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనలో ఉండటంతో డీఏపై శుక్రవారం వెలువడని ప్రకటన
  2. 317 జీవో రిపోర్ట్‌పై సీఎస్ శాంతికుమారితో చర్చించిన టీఈజేఏసీ నేతలు
  3. క్యాబినెట్‌లో ఆమోదం తెలిపి రిపోర్టును బహిర్గతం చేస్తామన్న సీఎస్
  4. సమస్యలన్నీ పరిష్కరించాలని జేఏసీ నేతల వినతి

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): డీఏలపై శుక్రవారం ప్రకటన వెలువడుతుందని ఆశగా ఎదురుచూసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం కలిసినప్పుడు శుక్రవారం సాయంత్రంలోగా డీఏలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేస్తారని తెలిపారు.

కానీ, డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు శనివారం క్యాబినెట్ పలు అంశాలపై సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే డీఏలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఐదింటిలో రెండు డీఏలను ప్రభుత్వం ప్రకటించే వీలుందని జేఏసీ నేతలు చెబుతున్నారు. 

సీఎస్‌ను కలిసిన జేఏసీ నేతలు

ఇదిలా ఉంటే 317 సమస్యపై సీఎస్‌ను కలిసి చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలకు గురువారం సూచించడంతో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతం లో సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు నేతృత్వంలోని నేతలు శ్రీపాల్ రెడ్డి, చావా రవి, సదానంద గౌడ్, మధుసూదన్ రెడ్డి, అబ్దుల్లా, కటకం రమేష్ తదితరులు కలుసుకున్నారు.

317 జీవో బాధిత ఉద్యోగులకు సంబం ధించిన రిపోర్టుపై చర్చించారు. 317 జీవో క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ సీఎంకు అందిందని, ఆ రిపోర్టు ఇంకా ఓపెన్ చేయలేదని ఉద్యోగులతో సీఎస్ చెప్పినట్లు తెలిపారు. శనివారం జరిగే క్యాబినెట్ సమావేశంలో 317 కమిటీ రిపోర్ట్‌ను ఆమోదించి, రిపోర్టును బహిర్గతం చేస్తామని, పబ్లిక్ డొమైన్‌లో పెడతామని సీఎస్ తెలిపారు.

లోపాలన్నీ సవరించాలి

317 జీవోలోని ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని సీఎస్‌ను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కోరారు. సీఎస్‌ను కలిసిన అనంతరం వారు మీడియా సెంటర్‌లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల జేఏసీ జరిపిన సమావేశం విజయవంతమైందని తెలిపారు.

317 జీవో వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని సీఎస్‌ను కోరినట్లు పేర్కొన్నారు. 317 జీవో ద్వారా నష్టపోయిన ఉద్యోగుల యొక్క ప్రతి దరఖాస్తును పరిశీలించి న్యాయం చేయాలని, అవసరమైతే సూపర్ న్యూమరరీ  పోస్టులను ఏర్పాటు చేసి సర్దుబాటు చేయాలని కోరినట్లు తెలిపారు.

317 జీవో అనేది చాలా లోప భూ ఇష్టంగా ఉన్నదని, ఉద్యోగ సంఘాలు నెత్తి, నోరు కొట్టుకొని గత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ అప్పటి ప్రభుత్వం నిరంకుశంగా ఉద్యోగుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా  వ్యవహరించి ఆ జీవోను తీసుకొచ్చి ఉద్యోగుల మీద రుద్దారని మండిపడ్డారు.

ఆ జీవో కారణంగా స్థానికతకు అవకాశం ఇవ్వకుండా కేవలం సీనియార్టీ ప్రాతిపదికన కేటాయించడంతో, స్థానికులుగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. అలా ఉద్యోగులను పంపించడం వల్ల కు టుంబాలు కుటుంబాలు దూరమవ్వడమే కాకుండా భార్యాభర్తలు, వికలాంగులు, విడో కేసులు, మెడికల్ గ్రౌండ్ ఉన్న ఉద్యోగులు నేడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

317 జీవో ఫలితంగా ఎన్నికల్లో  ఉద్యోగుల కోపాన్ని గత ప్రభుత్వం చవిచూసిందన్నారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 317 జీవోలో జరిగిన లోపాలన్నింటినీ సవరించి, ప్రతి ఒక్కరినీ వారి వారి సొంత ప్రాం తాలకు కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. 1975 ప్రెసిడెంట్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా 2018 రాష్ర్టపతి ఉత్తర్వులను తీసుకురావడం, అందులోనూ భార్యాభర్తలను ఒక చోట పని చేసే అవకాశం ఇవ్వకపోవడం లాంటి చాలా అంశాలున్నాయని వారు పేర్కొన్నారు.

317 జీవోలో స్థానికతను పరిగణలోకి తీసుకోవాలి: టీజేఏసీ నేత లచ్చిరెడ్డి

317 జీవోలో స్థానికతను కూడా పరిగణలోకి తీసుకురావాలని టీజీజేఏసీ నేత లచ్చిరెడ్డి తెలిపారు. సీఎస్‌ను కలిసిన అనంతరం సచివాలయంలోని మీడియా సెం టర్‌లో మాట్లాడారు. 317 జీవోపై సీఎస్‌కు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ జీవో కారణంగా మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఉద్యోగులు ఎ క్కువగా నష్టపోయారన్నారు.

ఏ ఒక్క బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తాము సూచించిన అంశాలపై క్యాబినెట్‌లో చర్చించాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. 2018లో జోనల్ వ్యవస్థపై ఏమాత్రం అవగాహన లేకుండా గత ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను సర్దుబాటు చేసే క్రమంలో అనేక తప్పిదాలు జరిగనట్లు ఆయన పేర్కొన్నారు.

భార్యభర్తలిద్దరినీ ఒకే ప్రాంతాన్ని సర్దుబాటు చేయాలని కోరారు. అయితే మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ గ్రౌండ్‌లోని బాధిత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు డా.నిర్మల, హన్మంతరావు, నవాత్ సురేష్, దర్శన్‌గౌడ్, హరికృష్ణ పాల్గొన్నారు.